ఎక్స్‌రే.. తీయరే!

X Ray Machine Not Working In Kurnool Hospital - Sakshi

పెద్దాసుపత్రిలో పనిచేయని ఎక్స్‌రే మిషన్లు

మరమ్మతు చేయని టీబీఎస్‌ సంస్థ

‘డీఆర్‌ సిస్టమ్‌’ను అమర్చేదెన్నడో?

తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

కర్నూలు పెద్దాసుపత్రిలో ఎక్స్‌రే మిషన్లను ‘నిర్లక్ష్యపు రోగం’ పట్టిపీడిస్తోంది. మిషన్లు చెడిపోయి..రోగుల అవస్థలకు కారణమవుతున్నాయి. వీటి మరమ్మతుల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఆసుపత్రిలో వైద్యపరికరాల మరమ్మతుల పేరిట ప్రతినెలా లక్షలాది రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడ ఏ పరికరమూ సక్రమంగా పనిచేయడం లేదు. ఉన్న ఒకట్రెండు పరికరాల వద్ద రోగులు పడిగాపులు కాస్తున్నారు. ఎక్స్‌రే మిషన్లు  రెండు నెలలుగా పనిచేయకపోయినా.. వాటిని మరమ్మతు చేయాల్సిన టీబీఎస్‌ సంస్థ ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు.  

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతిరోజూ 2,500 నుంచి మూడు వేల మంది రోగులు ఓపీ చికిత్సకు వస్తున్నారు. అలాగే నిత్యం 1,500 మందికి పైగా ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. వీరిలో ప్రతిరోజూ 300 మందికి పైగా రోగులకు ఎక్స్‌రే పరీక్షలు అవసరం అవుతుంటాయి. ఆసుపత్రిలోని 500 ఎంఏ ఎక్స్‌రే మిషన్లు 7, మొబైల్‌ ఎక్స్‌రే మిషన్లు 10 ద్వారా ఈ సేవలు అందించాల్సి ఉంది. కానీ కొంత కాలంగా 500 ఎంఏ ఎక్స్‌రే మిషన్లు నాలుగు, మొబైల్‌ ఎక్స్‌రే మిషన్లు ఐదు పనిచేయడం లేదు. ఇక 1000 ఎంఏ, 800 ఎంఏ ఎక్స్‌రే మిషన్లు కొన్నేళ్లుగా మూలనపడ్డాయి. వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లతో డీఆర్‌ సిస్టమ్‌ అనే ఎక్స్‌రే మిషన్‌ పంపించింది. అయితే.. సదరు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు పూర్తిగా చెల్లించకపోవడంతో దాన్ని బిగించలేదు. నాలుగు నెలలుగా ఆసుపత్రిలో ఓ మూల చెక్కపెట్టెలో పడి ఉంది. ఈ యంత్రం ద్వారాఎక్స్‌రే ఫిల్మ్‌ లేకుండానే కంప్యూటర్‌లో పరీక్షా ఫలితాన్ని చూసే అవకాశముంది. ఈ మేరకు ప్రతి విభాగంలోనూ కంప్యూటర్లు ఏర్పాటు చేయాలి. కానీ ఇందుకు అవసరమైన కంప్యూటర్లు మాత్రం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. ఇటీవలే సదరు సంస్థ ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చి..మిషన్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. అయితే.. కంప్యూటర్లు ఎప్పటికి సమకూరుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

రోగుల అవస్థలు
ఎక్స్‌రే మిషన్లు చాలావరకు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర అవస్థ పడుతున్నారు. రోజూ 300 మందికి పైగా ఎక్స్‌రేకు వస్తున్నారు. గురువారం రేడియాలజీ విభాగం వద్ద ఓపీతో పాటు ఐపీ రోగులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పనిచేయని ఎక్స్‌రే మిషన్లను మరమ్మతు చేయాలని టీబీఎస్‌ సంస్థకు ఆసుపత్రి అధికారులు పలుమార్లు చెప్పినా.. ఇదిగో అదిగో అంటూ నెలలు గడిపేస్తున్నారు. దీనికితోడు ఎక్స్‌రే ఫిల్మ్‌లు ప్రింట్‌ తీసే యంత్రం కూడా నాలుగు రోజుల నుంచి మొరాయిస్తోంది. ప్రస్తుతం ఒకే యంత్రంతోనే ఫిల్మ్‌లు తీస్తుండటంతో నివేదికలు ఇచ్చేందుకు ఆలస్యమవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top