వావ్... బేంబూ చికెన్! | Wow ... Bamboo Chicken! | Sakshi
Sakshi News home page

వావ్... బేంబూ చికెన్!

Dec 23 2013 1:25 AM | Updated on Sep 2 2017 1:51 AM

చాపరాయి జలపాతం పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడింది. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చారు.

=రుచి అద్భుతం
 =పర్యాటకుల ప్రశంసలు
 =కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు

 
డుంబ్రిగుడ, న్యూస్‌లైన్ : చాపరాయి జలపాతం పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడింది. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. ఘుమఘుమలాడుతూ నోరూరిస్తున్న బేంబూ చికెన్‌ను అంతా లొట్టలువేసుకుంటూ తిన్నారు. కార్తీక మాసం ముగిసిపోవడంతో మాంసాహార ప్రియులతో బేంబూ చికెన్ దుకాణాల రద్దీగా మారాయి. పర్యాటకులంతా బేంబూ చికెన్‌ను ఎంతో ఇష్టంగా భుజించడంతో ఆ వ్యాపారుల పంట పండింది. రెట్టించిన ఉత్సాహంతో అగిన వారందరికీ క్షణాల్లో చికెన్ వండి వడ్డించారు.

రుచి చాలా బాగుందంటూ పలువురు పర్యాటకులు సాయంత్రం కూడా ఆరగించేందుకు ప్యాక్ చేయించుకుని తీసుకువెళ్లారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటూ వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. పలువురు పర్యాటకులు బేంబూ చికెన్ తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. మంచి లాభాలు రావడంతో చికెన్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. అరకు-పాడేరు ప్రధాన రహదారి రైల్వే ట్రాక్ సమీపంలో ఒక్క చోట మాత్రమే వలిసె పూలు ఉండడంతో పర్యాటకులు అక్కడకు చేరుకుని సరదాగా గడిపారు. వలిసె పూల అందాల మధ్య ఫొటోలు తీసుకున్నారు.  
 
కిక్కిరిసిన జలపాతాలు

జి.మాడుగుల: కొత్తపల్లి గ్రామ సమీపంలోని జలపాతాలు ఆది వారం పర్యటకులతో సందడిగా మారాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. రెండు కొండల మధ్య రాళ్లపై నుంచి జాలువారుతున్న జలపాతాల అందాలను చూసి పర్యాటకులు మురిసిపోయారు. జలకాలాడుతూ కేరింతలు కొట్టారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అభి వాటర్‌ఫాల్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
 
పోటెత్తిన పర్యాటకులు

అరకులోయ: అరకులోయకు పర్యాటకులు పోటెత్తారు. వేల సంఖ్యలో తరలి రావడంతో ఈ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలన్నీ కళకళలాడాయి. పద్మావతి గార్డెన్, మ్యూజియం జనంతో నిండిపోయాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement