మామిడి తోటలకు పురుగుల దెబ్బ | Worms attacks on mango gardens | Sakshi
Sakshi News home page

మామిడి తోటలకు పురుగుల దెబ్బ

Nov 16 2014 1:52 AM | Updated on Jun 4 2019 5:04 PM

మామిడి తోటలపై పురుగులు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 డీజీపేట, (సీఎస్‌పురం) :  మామిడి తోటలపై పురుగులు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఉద్యానపంటల వైపు దృష్టి సారించారు. మెగా వాటర్‌షెడ్ పథకం కింద డీజీపేటలో 24 ఎకరాలు, ఉప్పలపాడు, కొండబోయినపల్లిలో 38, రేగులచెలకలో 15 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. మరో 300 ఎకరాల్లో సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 11 పంచాయతీల పరిధిలో 504 ఎకరాల్లో మామిడి తోటల సాగుకు రైతులు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో వెంగనగుంట, పెదగోగులపల్లిల్లో 30 ఎకరాల్లో మామిడి తోటల సాగు చేపట్టారు. ఇవి కాక మరో 298 ఎకరాల్లో గతంలో మామిడి తోటలు సాగు చేశారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం రావడం, మంచు పడుతుండటంతో మామిడి తోటలపై పురుగులు దాడి చేస్తున్నాయి. ఆకుపచ్చ రంగులో రెండు, మూడు అంగుళాల మేర ఉన్న పురుగులు చిగుర్లతో పాటు ఆకులను కూడా తినేస్తున్నాయి. ఈ పురుగులు పగలు కనిపించడం లేదని..రాత్రివేళల్లోనే చెట్లపై దాడి చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వేరుపురుగు చేరి ఏపుగా పెరిగిన అనేక మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయని వాపోతున్నారు. నివారణకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. బయట దుకాణాల్లో వారిచ్చిన మందులు తెచ్చి వాడితే రెండు రోజులు పురుగులు తగ్గుతాయనీ, ఆపై మళ్లీ దాడి చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు.  

 ఆచూకీలేని ఉద్యానవన శాఖ అధికారులు:
 మండలంలో ఉద్యానవన శాఖ అధికారుల చిరునామా కరువైంది. బత్తాయి తోటలు ఎండిపోయినా..పసుపు పంటకు తెగుళ్లు సోకినా పట్టించుకునేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడం మాట అటుంచి.. కనీసం అధికారిక కార్యక్రమాలైన పొలం పిలుస్తోంది, జన్మభూమిలకు కూడా హాజరుకావడం లేదు. దీనిపై ఉద్యానవన శాఖ జేడీ పీ జెన్నమ్మను సాక్షి వివరణ కోరగా...త్వరలో ఉద్యానవన శాఖాధికారులను నియమిస్తామన్నారు. పురుగుల దాడి నుంచి మామిడి చెట్లను కాపాడుకునేందుకు మొక్కల మొదళ్లలో గుళికల మందు వేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement