రైలు పట్టాలపై శవమై.. | Woman killed in suspicious circumstances | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై శవమై..

Jan 28 2014 4:37 AM | Updated on Sep 2 2017 3:04 AM

రాయచోటి మార్గంలోని రైల్వేగేటుకు సమీపంలో రైలు పట్టాలపై సోమవారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది.

కడప అర్బన్/చింతకొమ్మదిన్నె, న్యూస్‌లైన్ :  రాయచోటి మార్గంలోని రైల్వేగేటుకు సమీపంలో రైలు పట్టాలపై సోమవారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఊటుకూరు గ్రామానికి చెందిన పలవలి సావిత్రమ్మగా(42) గుర్తించారు. మృతురాలు ఈనెల 25వ తేదీ ఉదయం తమకు రావాల్సిన బాకీ డబ్బుల కోసం సుజాత ఫోన్ చేయడంతో ఆమె ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రైల్వే, తాలూకా, చింతకొమ్మదిన్నె పోలీసుల, సావిత్రమ్మ భర్త లక్ష్మిరెడ్డి,

 బంధువుల కథనం మేరకు...
 చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన పలవలి సావిత్రమ్మ ఆశ వర్కర్‌గా, ఓ పొదుపు సంస్థ ఏజెంటుగా వ్యవహారిస్తోంది. ఇటీవల స్థలం అమ్మగా వచ్చిన భారీమొత్తాన్ని అవసరానికి ఇస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామంలోని సుజాత ద్వారా చాలామందికి వ్యక్తిగత రుణాలిచ్చింది. ఈనెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు సుజాత   ఫోన్‌చేసి రుణాలకు సంబంధించి డబ్బులు ఇస్తారని, రావాలని చెప్పడంతో వెళ్లిన సావిత్రమ్మ అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అన్నిచోట్ల వెతికిన కుటుంబ సభ్యులు ఆదివారం చింతకొమ్మదిన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఉదయం రైలుపట్టాలపై మృతదేహమై కనిపించింది. ఈ మృతదేహాన్ని ఓ గోనె సంచిలో తెచ్చి రైలు పట్టాలపై పడేసినట్లు ఆనవాలు కనిపిస్తున్నాయి. ట్రైనీ డీఎస్పీ కల్పన, కడప రూరల్, అర్బన్ సీఐలు రాజగోపాల్‌రెడ్డి, శివన్న, తాలూకా ఎస్‌ఐ బాల మద్దిలేటి, చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ బందేసాహెబ్, రైల్వే హెడ్ కానిస్టేబుల్ పీవీ రమణ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో విచారించారు. మృతురాలి భర్త లక్ష్మిరెడ్డి రాడ్ బెండర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి కుమారుడు రమేష్‌రెడ్డి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ కుమారుడు సాయిరాంరెడ్డి పదవ తరగతి వరకు చదువుకొని తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్నాడు.

 కేసు నమోదు
 సావిత్రమ్మ మృతిని రైల్వే పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం బృందం పరిశీలించింది. డాగ్‌స్క్వాడ్ సుజాత ఇంటి, రైల్వేట్రాక్ పరిసర ప్రాంతంలో సంచరించింది. సుజాతను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

 పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన
 సావిత్రమ్మ బంధువులు తమకు న్యాయం జరగలేదని ఊటుకూరు ప్రాంతానికి చెందిన స్థానికులతో కలిసి సోమవారం రాత్రి తాలూకా పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అర్బన్ సీఐ శివన్న, తాలూకా ఎస్‌ఐ బాల మద్దిలేటి బాధితులతో మాట్లాడుతూ కేసు బదిలీ కాగానే  దర్యాప్తు ప్రారంభిస్తామని నచ్చజెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement