
'బాబు..ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకురావాలి'
ఈనెల 23న కోటి సంతకాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని ఆయన తెలిపారు.
విశాఖ : రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది నెలలు దాటినా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించకపోవడం అన్యాయమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ఓడరేవులు, ఎయిర్పోర్టుల నిర్మాణాల్లో ఇప్పటికీ కదలిక లేదన్నారు.
కాలయాపనతో చంద్రబాబు నాయుడు...ప్రజలను మభ్యపెడితే సహించేది లేదని రఘువీరా హెచ్చరించారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న చంద్రబాబు....ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకు రావాలన్నారు. అంతవరకు ఢిల్లీలోనే ఉండాలని, తాము క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో ప్రజల మద్దతు కూడగడుతామన్నారు.
ప్రత్యేక హోదాపై అరుణ్‌జైట్లు చేసిన వ్యాఖ్యల్లో స్పష్టత లేదని రఘువీరారెడ్డి అన్నారు. కోటి సంతకాల సేకరణతో కేంద్రం కదిలి వచ్చే కొంతమేర నిధులు విడుదల చేసిందని ఆయన అన్నారు. విభజన హామీలను చంద్రబాబు సాధించుకురావాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఈనెల 23న కోటి సంతకాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని ఆయన తెలిపారు.