పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీచేస్తాం: డీజీపీ | will filling up of the posts in police department | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీచేస్తాం: డీజీపీ

Mar 30 2015 10:11 PM | Updated on Aug 21 2018 8:41 PM

పోలీసు శాఖలో వివిధ హోదాల్లో దాదాపు పది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరలో భర్తీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు తెలిపారు.

కర్నూలు: పోలీసు శాఖలో వివిధ హోదాల్లో దాదాపు పది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరలో భర్తీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు, కడప జిల్లాల పోలీసు అధికారులతో నేరాలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రేహౌండ్స్ లేదా ఆక్టోపస్‌కు సంబంధించిన శిక్షణ కేంద్రం కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం స్థల పరిశీలన జరుగుతుందన్నారు. ఇసుక, ఎర్ర చందనం అక్రమ రవాణాపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి కేసు విషయంపై మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీకి కేసు వాయిదా పడిందని, మారిషస్ కోర్టు అనుమతితో గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. ఆయన అక్రమ ఆస్తుల స్వాధీనం విషయంలో చట్టంలో సవరణ చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఫారసు చేసిందన్నారు. పోలీసు శాఖలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో కర్నూలులో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా జరుగుతోందని, అందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ, కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాటి, ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement