సీఎం వైఎస్‌ జగన్‌: సంక్షేమ జాతర | YS Jagan Announces Welfare Schemes for Farmers and says Farmers are the first priority - Sakshi
Sakshi News home page

సంక్షేమ జాతర

Oct 17 2019 11:29 AM | Updated on Oct 17 2019 12:50 PM

Welfare Schemes To Benefit People - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సంక్షేమ జాతర కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మత్స్యకార, చేనేత వృత్తులవారు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, న్యాయవాదులు, హోంగార్డులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వీటి ద్వారా జిల్లాలో దాదాపు 50 వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

‘వైఎస్సార్‌ నేతన్న హస్తం’ ద్వారా చేనేతలకు సాయం..
మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ‘వైఎస్సార్‌ నేతన్న హస్తం’ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నారు. ఒక్కొక్క చేనేత కార్మికునికి సంవత్సరానికి  రూ.24 వేల మేరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ఈనెలాఖరుకల్లా లబ్ధిదారుల రీ వెరిఫికేషన్‌ పూర్తి చేసి డిసెంబర్‌ 21 నుంచి అమల్లోకి తేనుంది. ఈ లెక్కన జిల్లాలో 2 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

మత్స్యకారులకు రూ.10 వేల చేయూత
వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేయాలని నిర్ణయించింది. మెకనైజ్డ్, మోటారైజ్డ్, నాన్‌ మోటారైజ్డ్‌ బోట్లు ఉన్న కుటుంబాలకు వర్తింపచేయనుంది. తెప్పలపై సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ప్రకారం జిల్లాలో సుమారు 15 వేల మందికి ప్రయోజనం కలగనుంది. వేట నిషేధ సమయమైన ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు ఈ సాయం వర్తించనుంది. నవంబర్‌ 21న ఈ పథకం అమల్లోకి రానుంది. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్‌ సబ్సిడీని కూడా 50 శాతం పెంచుతూ కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచనుంది. బంకులో డీజిల్‌ తెచ్చుకుంటున్న సమయంలోనే సబ్సిడీ లబ్ధి చేకూర్చనుంది.

మధ్యాహ్న భోజన కార్మికులు, హోంగార్డులకు వేతన పెంపు.. 
మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.వేయి నుంచి రూ.3 వేలకు పెంచేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లాలో 6 వేలమంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. హోంగార్డుల డెయిలీ అలవెన్స్‌ను రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 660మంది వరకు లబ్ధి పొందనున్నారు.

జూనియర్‌ న్యాయవాదులకు తీపి కబురు..  
ఎన్‌రోల్‌ అయి, మూడేళ్లలోపు ఉన్న జూనియర్‌ న్యాయవాదులకు  నెలకు రూ. 5 వేల స్టయిఫండ్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అమలు చేయనుంది.

 అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు  శుభవార్త..
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చనుంది. దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు నేరుగా వారి అకౌంట్లకు జీతాలు వేయనుంది. దీనితో మధ్య వర్తుల ప్రమేయం, దోపిడీకి చెక్‌ పడనుంది.

వైఎస్సార్‌ ఆదర్శం పథకం కింద యువతకు వాహనాలు..  
ఇసుక రవాణా, పౌరసరఫరాలు సహా ప్రభుత్వం వాడే ప్రతి రవాణాలో స్వయం ఉపాధికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంక్షేమ కార్పొరేషన్‌ల ద్వారా ట్రక్కుల కొనుగోలుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ట్రక్కు కొనుగోలుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. లబ్ధిదారుడు రూ.50 వేలు కడితే ట్రక్కు వచ్చేలా స్కీమ్‌ రూపొందించనుంది. కనీసం నెలకు రూ.20 వేలు ఆదాయం వచ్చేలా, ఐదేళ్ల తర్వాత యువతకు ఆ వాహనం సొంతమయ్యేలా చర్యలు తీసుకుంటుంది.   

కిడ్నీ ఆసుపత్రి పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌..  
సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన పలాస కిడ్నీ ఆసుపత్రిలో పోస్టులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో 5 రెగ్యులర్‌ పోస్టులు, 100 కాంట్రాక్ట్‌ పోస్టులు, 60 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు మంత్రివర్గం ఆమోదం పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement