పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ర్టం ఏర్పడితేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
బోనకల్, న్యూస్‌లైన్ : పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ర్టం ఏర్పడితేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ 28 రోజులుగా బోనకల్‌లో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన సోమవారం విరమింపజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కోదండరాం మాట్లాడారు. ఉద్యమాల పురిటిగడ్డ బోనకల్ అని, తెలంగాణ సాయుధ పోరాటానికి ఇక్కడే బీజం పడిందని అన్నారు. సకలజనుల సమ్మె 42 రోజులపాటు నిర్వహించడంలో ఖమ్మం జిల్లా పాత్ర మరువరానిదని కొనియాడారు. మన ఓట్లతో గెలిచి గద్దె ఎక్కిన వారికి భయపడొద్దని, మన చేతిలో వజ్రాయుధం ఉంచుకుని పిరికిపందల్లా బతకొద్దని అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెప్పిన రాజకీయ నేతలు మాటమార్చడం దారుణమన్నారు. ఎవరినడిగి తెలంగాణ ఇస్తున్నారంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలసి తెలంగాణ ప్రక్రియను జాప్యం చేయమని అడగడం ఆయన రెండు కళ్లసిద్ధాంతానికి నిదర్శనమని విమర్శించారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే వరకూ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక బోనకల్‌లో విజయోత్సవ సభను నిర్వహించుకుందామని ఆకాంక్షించారు. ఎంపీడీఓల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ నీచ రాజకీయాలతో ఉద్యమాలను అణచివేసేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని, దీంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.
కోదందరాం పర్యటన సాగిందిలా...
కోదండరాం, జేఏసీ నాయకులకు బోనకల్‌లో ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొదండరాంను అధ్యపక బృందం సన్మానించింది. అనంతరం జిల్లా సరిహద్దులో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత మండల కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులతో కలిసి ర్యాలీగా బయల్దేరి బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహాన్ని కోదండరాం ఆవిష్కరించారు. అరుణోదయ నాగన్న బృందం ఆటపాటలతో అలరించింది. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, మండల కన్వీనర్ గుర్రాల నాగేందర్, వెంకటపతిరాజు, కనకరాజు, పోటు రంగారావు, తిరుమలరావు, కల్యాణపు నాగేశ్వరరావు, బందం శ్రీను, రేగళ్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.