డెడ్‌ స్టోరేజ్‌..!

Water Projects Reached Dead Storage Level In Prakasam - Sakshi

వర్షాభావంతో డెడ్‌స్టోరేజీకి చేరుకున్న మోపాడు రిజర్వాయర్‌

ఏడేళ్లుగా సాగుకు నోచుకోక బీడువారుతున్న మోపాడు ఆయకట్టు

కూలీలుగా వలసలు పోతున్న ఆయకట్టు రైతాంగం

మోపాడును వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని రైతుల డిమాండ్‌

మోపాడు (పామూరు):  కరువు తరుముతోంది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజీకి చేరుకోని నీళ్ల కోసం దీనంగా నోరు తెరిచి ఎదురుచూస్తున్నాయి. వీటి పరిధిలోని వేల ఎకరాల ఆయకట్టు భూములు సాగుకు నోచుకోక బీడు భూములుగా మారడంతో అన్నదాతకు పూట గడవటం కష్టంగా మారి కూలీలుగా మారుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మండల పరిధిలోని మోపాడు రిజర్వాయర్‌ డెడ్‌స్టోరేజీకి చేరుకుంది.

ఏడేళ్లుగా సాగుకు నోచుకోని ఆయకట్టు భూములు..
మండలంలోని మోపాడు రిజర్వాయర్‌ వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరు అడుగంటింది. గత 7 ఏళ్లుగా ఆయకట్టు భూములు సాగుకు నోచుకోక రైతన్నకు ఈ రిజర్వార్‌ దన్నుగా నిలవలేకపోతోంది. ఈ ప్రాంతంలో కరువును పారదోలేందుకు స్వాతంత్య్రానికి పూర్వం అప్పటి బ్రిటీష్‌ పాలకులు  మోపాడు  1906లో రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ప్రారంభించి 1921 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేసి నీటిని ఆయకట్టుకు వదిలారు.  మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయిన మోపాడు రిజర్వాయర్‌కు ప్రధానంగా నీరుచేరాలంటే కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం భైరవకోన అటవీప్రాంతంతో పాటు అదే మండలంలోని పిల్లిపల్లి, బోయమడుగుల గ్రామాల పైతట్టున ఉన్న అటవీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే డొక్కలవాగు, మన్నేరు ద్వారా, పామూరు మండలంలోని వర్షపు నీరు నాచవాగుద్వారా మోపాడు రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. పూర్తిగా వర్షాధానంపై ఆధారపడిన మోపాడు మీడియం ఇరిగేషన్‌ రిజర్వాయర్‌ తొట్టిప్రాతం సుమారు 4,500 ఎకరాలు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 2.1 టీఎంసీలు. రిజర్వాయర్‌ పరిధిలో 12,719 ఎకరాల సాగు భూమి ఉంది.

ఇందులో ప్రకాశం జిల్లా పామూరు మండలంలో 8,174 ఎకరాలు, పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కొండాపురం మండలంలో 4,545 ఎకరాలు ఉంది. వర్షాలు కురిసి మోపాడు రిజర్వాయరుకు సంవృద్ధిగా  నీరు చేరి పూర్తిగా నిండితే 29 అడుగుల వద్ద రిజర్వాయర్‌ అలుగుపారి ఆయకట్టు పరిధిలో అధికారికంగా 12,719 ఎకరాలు, అనధికారికంగా  18 వేల ఎకరాల వరకు వరి పండటంతోపాటు ఆరుతడి పంటలుగా కంది, జొన్న, పొద్దుతిరుగుడు, నూగు, శనగ పంటలు పండుతాయి. 2015 డిసెంబర్‌లో రిజర్వాయర్‌కు 13.6 అడుగులమేర నీరుచేరగా వరిపంట సాగుకు నీరు సరిపోవని ఆయకట్టుకు విడుదల చేయచేయలేదు. ఈ దశలో 2017లో ఆయకట్టులో ఆరుతడిగా వేసిన జొన్న పైరు ఎండిపోతుండగా విధిలేని పరిస్థితుల్లో రైతుల విజ్ఞప్తితో నీటిని విడుదలచేయగా రిజర్వాయర్‌లోని నీరు 3 అడుగులకు చేరుకుని అడుగంటే స్థితికి వచ్చింది. కాగా 2017 సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో కురిసిన కొద్దిపాటి జల్లులకు రిజర్వాయర్‌కు అడుగుల నీరు చేరగా ప్రస్తుతం కొంతనీరు తగ్గి రిజర్వాయర్‌లో నీరు 5.1 అడుగుల్లో డెడ్‌స్టోరోజ్‌ లెవల్లో ఉంది. మోపాడు రిజర్వాయర్‌ను వెలిగొండ పరిదిలోనికి చేర్చి తద్వారా రిజర్వాయర్‌కు  శాశ్వత నీటి కేటాయింపులతో  శాశ్వత ప్రాతిపదికన సాగునీటితో పాటు, తాగునీటి సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రతిపాదనలకే పరిమితమవుతున్న జైకా నిధులు
మండలంలోని మోపాడు రిజర్వాయర్‌ అలుగు పొడవును 250 మీటర్ల మేర పెంచేందుకు, రిజర్వాయర్‌  ప్రధాన కాల్వ 22 కిలోమీటర్లు,  బొట్లగూడూరు బ్రాంచ్‌ కెనాల్‌ 8 కి.మి.ల గ్రావెల్‌ కాల్వలను సీసీ కాల్వలుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా పామూరు కందుకూరు  ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి రిజర్వాయర్‌ వరకు తారురోడ్డు నిర్మాణం, నీరు పొలాల్లోకి వెళ్లేందుకు పిల్లకాల్వల నిర్మాణం, సప్టాల బాగుచేయించేందుకు మొత్తం రు. 32.41 కోట్ల జైకా నిధులకు గత సెప్టెంబర్‌లో ప్రతిపాదనలు పంపగా నేటికి నిధులు విడుదల కాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top