రెచ్చగొట్టడం సరికాదు


  • కేసీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

  •  పశ్చిమకృష్ణా ఎన్జీవోల సంఘం

  •  విజయవాడ, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే అంటూ టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎన్జీవోల సంఘం పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడతామంటూ ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు.



    స్థానిక ఎన్జీవో హోంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అంతగా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే ఆంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల విషయంలోనూ ఇక్కడి ప్రభుత్వం అదే తీరుగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లక్షలాది ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు.



    తీరా రాష్ట్రం విడిపోయాక ఉద్యోగుల సంఖ్య వందల్లోనే ఉండడంతో అక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత  ఎన్నికల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని అక్కడి యువతను మోసగించారని, ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.



    సచివాలయంలో ఉన్న ఉద్యోగులంతా తెలంగాణలో జన్మించిన వారేనని విద్యాసాగర్ స్పష్టం చేశారు.  ఈ విషయం కేసీఆర్‌కు తెలిసి కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు.  కేవలం ఎన్నికల్లో  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వైదొలిగేందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజలకు, యువతకు అర్థమైందన్నారు.



    తప్పడు ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తామంటూ కేసీఆర్ చేసిన హామీ నెరవేరే పరిస్థితి  కనుచూపుమేరలో లేదన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతామన్నారు.



    విభజన తర్వాత స్థిరాస్తి పంపకాల్లో సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.  తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసరావు, వాసు, సిటీ అధ్యక్షుడు కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top