అన్నీ రికార్డులే!

Voting Percentage Hikes in East Godavari - Sakshi

నోటాకు పెరిగిన ఓట్లు

అర్ధరాత్రి వరకు వరుసలోనే..ఓటింగ్‌లో మహిళలదే ఆధిక్యం

సిబ్బంది ఎక్కువే సస్పెన్షన్లూ అధికమే

మూడుకు మూడు,19కి 14 ఎమ్మెల్యేలు

అధిక పోలింగ్‌

జిల్లాలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్ల తీర్పు వరకు గతానికి భిన్నంగా సాగింది. గత ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదు కావటం అందులోనూ మహిళా ఓటింగ్‌ పెరగటం, అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగటం, భారీ మెజార్టీ నమోదు కావటం, జిల్లా ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల తీర్పు రావడం లాంటి కొత్త రికార్డులు నమోదయ్యాయి.

కాకినాడ సిటీ: జిల్లాలో మొత్తం ఓటర్లు 42,04,436 మంది ఉండగా ఏప్రిల్‌ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 33,63,352 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ నమోదు కాగా 80 శాతం, 2014లో 74.24 శాతం నమోదైంది. అనపర్తి నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 85.74 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 87.48 శాతం నమోదైంది. రాజమహేంద్రవరం సిటీ 2014లో 65.28 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 87.47 శాతం, మండపేట నియోజకవర్గంలో 2014లో 82.26 శాతం 2019 ఎన్నికల్లో 85.52 శాతం, కొత్తపేట నియోజకవర్గంలో 2014లో 80.47 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 84.30 శాతం, రామచంద్రపురం నియోజకవర్గంలో 2014లో 80.67 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 87.11 శాతం, జగ్గంపేట నియోజకవర్గంలో 2014లో 78.71 శాతం నమోదు కాగా 2019 ఎన్నికల్లో 85.86 శాతం నమోదైంది.

భారీ మెజార్టీలు
2019 ఎన్నికల్లో అనపర్తి, తుని, పిఠాపురం, అమలాపురం, జగ్గంపేట, రాజానగరం, కాకినాడ సిటీ, పి.గన్నవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో గెలుపొందిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు 10వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అనపర్తి నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా గెలుపొందిన సత్తి సూర్యనారాయణరెడ్డి సమీప ప్రత్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై 55,207 ఓట్ల ఆధిక్యత సాధించారు. తుని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా 24,016 ఓట్లు, కాకినాడ సిటీ అభ్యర్థి 14,111 ఓట్లు, అమలాపురం అభ్యర్థి పినిపే విశ్వరూప్‌ 25,654 ఓట్లు, పిఠాపురం అభ్యర్థి పెండెం దొరబాబు 14,992 ఓట్లు,  రంపచోడవరం అభ్యర్థి నాగుల పల్లి ధనలక్ష్మి 39,106 ఓట్లు, పి.గన్నవరం అభ్యర్థి కొండేటి చిట్టిబాబు 22,257 ఓట్లు, రాజానగరం అభ్యర్థి జక్కంపూడి రాజా 31,712 ఓట్లు, జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల చంటిబాబు 23,365 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

నోటాకు పెరిగిన ఓట్లు
ఈసారి ఎన్నికల్లో నోటాకు ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. తుని 2,927, ప్రత్తిపాడు 2,105, పిఠాపురం 2,595, పెద్దాపురం 2,292, జగ్గంపేట 3,626, అనపర్తి  2,708, రాజానగరం 2,857, రాజమహేంద్రవరం రూరల్‌ 2,211, రామచంద్రపురం 2,007, ముమ్మిడివరం 2,816, అమలాపురం 2,357, పి.గన్నవరం 3,020, కొత్తపేట 2,395, మండపేట నియోజకవర్గంలో 2,086 వంతున ఓట్లు నోటాకు వచ్చాయి.

అర్ధరాత్రి వరకు వరుసలోనే..
గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో 193 నియోజకవర్గాల్లోని ఈవీఎంలు మొరాయిం చాయి. జిల్లాలోని చాలా పోలింగ్‌ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, పిఠాపురం, తుని, జగ్గంపేట, రాజానగరం, మండపేట తదితర నియోజకవర్గాల్లో సుమారు 112 పోలింగ్‌ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి కన్పించారు.

ఓటింగ్‌లో మహిళలదే ఆధిక్యం
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌లో మహిళలు ఆధిక్యత చాటుకున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు 21,23,332 మంది ఉండగా వీరిలో 16,69,578 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాకినాడ సిటీలో నియోజకవర్గంలో 1,32,327 మంది మహిళలు ఉండగా 87,552 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాజోలులో 93,787 మంది మహిళలుండగా 74,116 మంది, రాజమహేంద్రవరం సిటీలో 1,30,734 మంది ఉండగా 86,474 మంది, రాజమహేంద్రవరం రూరల్‌లో 1,29,450 మంది మహిళా ఓట్లు ఉండగా 94,676, మండపేట నియోజకవర్గంలో 1,09471 మంది మహిళా ఓటర్లు ఉండగా 92,920 మంది ఓట్లు వేశారు.

మూడుకు మూడు, 19కి 14
జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు తీర్పు వెల్లడించారు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలుండగా మూడింటిని వైఎస్సార్‌ సీపీ గెలుచుకుంది. 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగు స్థానాలతో టీడీపీ సరిపెట్టుకోవల్సి వచ్చింది. జనసేనకు ఒకటి దక్కింది.

ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఎక్కువే
జిల్లాలో గత ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బంది నియామకం కొంత పరిమితంగా ఉండేది. ఈసారి గతానికి కంటే భిన్నంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బందిని ఎక్కువగా నియమించారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో మొత్తం 36,534 మంది సిబ్బందిని నియమించారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలకు కూడా ఈ ఎన్నికల్లో విధులు కేటాయించారు.

అధికారుల సస్పెన్షన్లూ అధికమే
ఈ ఎన్నికల్లో గతంలో లేనివిధంగా అధికారులు, సిబ్బంది, సస్పెన్షన్లు కొనసాగాయి. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ఈవీఎంల మొరాయింపు వ్యవహారం, వీవీప్యాట్‌ల వ్యవహారంలో మొత్తం 9 మందిపై చర్యలు తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top