జిల్లాకు రిక్తహస్తం
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జిల్లాలోని వివిధ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు :రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జిల్లాలోని వివిధ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, గత ఏడాది సాధించిన ప్రగతిని వివరించకుండా మంత్రి అంకెల గారడీ చేశారని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు తక్కువగా ఉందని, కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం బకాయిల చెల్లింపునకు సరిపోతుందంటున్నారు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలకు, మెటీరియల్ సరఫరాదారులకు ఈ మొత్తాలు సరిపోతాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాగా రావాల్సిన నిధులు కూడా తెచ్చుకునే ప్రయత్నమే జరగలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, సాగునీరు, రహదారులు తదితర శాఖలకు రాష్ట్ర స్థాయిలో భారీగా కేటాయింపులు జరిగినా గుంటూరు జిల్లాకు ఆ స్థాయిలో లేవని తెలుస్తోంది.బడ్జెట్‌లో సాగునీటిశాఖకు గత ఏడాది ఎంత కేటాయింపులు జరిగాయో అంతే మొత్తాలను దాదాపుగా తిరిగి కేటాయించారు.
= సాగర్ ఆధునికీకరణకు రూ.743 కోట్లు కేటాయించారు. కుడి కాలువకు సంబంధించి రూ.252 కోట్లు, ఎడమ కాలువకు రూ.370 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో రూ.4444 కోట్లను సాగర్ ఆధునికీకరణకు కేటాయించింది. అయితే నిర్మాణ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించలేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు పరిమితంగానే విడుదల అయ్యాయి.
= కృష్ణాడెల్టా ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.332.51 కోట్లను కేటాయించింది. సార్వత్రిక ఎన్నికలు రానున్న దృ ష్ట్యా ఈ మొత్తాన్ని ఈ సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేసే అవకాశం లేదని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు.
= వ్యవసాయం: నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని సకాలంలో ఆదుకున్నామంటూ ఆర్థిక మంత్రి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో పొందుపర్చడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపించాయి. నీలం తుపాను కారణంగా జిల్లాలోని 42 వేల మంది రైతులు నష్టపోగా ,32 వేల మందే పంటలు కోల్పోయారనీ, రూ.17 కోట్లు సరిపోతాయంటూ ప్రభుత్వం అరకొరసాయాన్ని విదిల్చింది. ప్రకటించిన మొత్తాలను కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనేలేదు.
= విద్యుత్: రాష్ట్ర వ్యాప్తంగా ఏటా లక్ష మంది రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని చెబుతున్న పాలకుల మాటలు ఫైళ్ళు దాటడం లేదు. పెండింగ్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని, పంపిణీ కంపెనీలను కనెక్షన్లు పెంచాలని ఆదేశించినట్లు మంత్రి ఓటాన్ అకౌంట్‌లో వల్లె వేశారు. అయితే కాంగ్రెస్ సర్కారు మాటల్లో వాస్తవం లేదు. జిల్లాలో 5,900 కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, అయితే ఇప్పటివరకు 1,564 మాత్రమే మంజూరు చేశారు.
= వైద్యం: జిల్లా వైద్య రంగానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ఎంతో కీలకమైన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. ఈ ఏడాది గుంటూరు వైద్య కళాశాలకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు బోధనాసిబ్బందిని కేటాయించలేదు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఏళ్లతరబడి ఖాళీగా వున్న వైద్యులు, వైద్య సిబ్బంది భర్తీ ప్రస్తావన లేదు.
= విద్య: జిల్లా విద్యారంగానికి కేటాయింపులు జరగలేదు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పథకం ద్వారా జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు మూడుదశల్లో 257 పాఠశాలలకు అదనపు తరగతులు మంజూరు కాగా, ఇప్పటి వరకు 100 పాఠశాలలకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. మిగిలిన 157 పాఠశాలకు నిధుల విడుదల చేయకపోవడంతో వాటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబడిన 16 మండలాల్లో మోడల్ స్కూల్స్ అవసరం కాగా, వీటిపై బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా జిల్లాలో వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టు ప్రకటించలేదు.