
మర్రిపాలెం (విశాఖ ఉత్తరం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా సులభంగా పాస్‌పోర్ట్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. అభ్యర్థులు మూడ్రోజుల్లో పాస్‌పోర్ట్ పొందేందుకు తత్కాల్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఆధార్, స్వీయ ధ్రువీకరణ పత్రం (అనెక్సార్–ఈ) సమర్పించాలన్నారు.
వీటితో పాటు ఏవైనా రెండు.. ఓటర్ కార్డు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఆర్మ్‌డ్ లైసెన్స్, మాజీ సైనికుల పెన్షన్ బుక్, సెల్ఫ్ పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, విద్యాలయాలు జారీ చేసిన విద్యార్థి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, రిజిస్ట్రార్ జారీ చేసి జనన ధ్రువీకరణ పత్రం తప్పక కలిగి ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు వారైతే ఆధార్‌తో పాటు విద్యార్థి గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు ఏదైనా ఒకటి సమర్పించాలని సూచించారు. సాధారణ పాస్‌పోర్ట్ మంజూరుకు ఆయా ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే పాస్‌పోర్ట్ మంజూరు చేస్తామన్నారు. అనంతరం పోలీస్ విచారణ ఉంటుందన్నారు. అయితే దీనికి ఎలాంటి అత్యవసర పత్రాలు, ‘అనెక్సార్–బి’ అవసరం లేదని ఆయన తెలిపారు.