అక్రమ వ్యాపారం.. కృత్రిమ కొరత

Vigilance and Enforcement Department Report to the AP Govt On Onions Price Issue - Sakshi

రాష్ట్రంలో ఉల్లి ధరల మంటకు కారణాలివే..  

ప్రభుత్వానికి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నివేదిక

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాపారులు తమ లాభం కోసం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో ఉల్లి ధరలు దిగిరావడం లేదు. ఉల్లి ధరల మంటకు గల కారణాలను గుర్తించడానికి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణ చేపట్టింది. ఉల్లి వ్యాపారం అధికంగా జరిగే కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్రయవిక్రయాలు, గత మూడేళ్లుగా ఉల్లి దిగుబడులు.. తదితర అంశాలను పరిశీలించగా, విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఉల్లి దిగుబడి అధికంగా వచ్చినా.. వ్యాపారులు తమ కమిషన్‌ కోసం ఉల్లిని ఇతర రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీనికితోడు కొంత సరుకును నల్లబజారుకు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈసారి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో ఉల్లి దొరక్కపోవడానికి వ్యాపారుల అక్రమాలే కారణమని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై మెరుపు దాడులు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికలోని అంశాలు.. 
- రాష్ట్రంలో రోజుకు 8–9 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం. నవంబరులో కర్నూలు రకం ఉల్లి ప్రధాన మార్కెట్లకు 3.83 లక్షల క్వింటాళ్లు వచ్చింది. ఇందులో దాదాపు 40 శాతం.. అంటే 1.60 లక్షల క్వింటాళ్ల ఉల్లి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయింది. మిగిలిన 2.23 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు 13 జిల్లాల్లోని వినియోగదారులకు సరిపోతాయి. 
అయినప్పటికీ ట్రేడర్లు/ఏజెంట్లు కృత్రిమ కొరత సృష్టించారు. తమకు వచ్చే 4 శాతం కమిషన్‌ కోసం ఇక్కడి ఉల్లిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు చేరుతుండడంతో స్థానికంగా ఉల్లి కొరత కొనసాగుతోంది. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగులు సరుకును మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే ఉల్లి కొరత ఉండదు.
ఉల్లి కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను రోజులుగా ఉల్లిని కొనుగోలు చేసి, రైతుబజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. కర్నూలు మార్కెట్‌లో కిలో రూ.65 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్లలో రాయితీపై వినియోగదారులకు అమ్ముతోంది. ధరల స్ధిరీకరణ నిధి ద్వారా ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. సబ్సిడీ ఉల్లి అమ్మకాల వల్ల ఇప్పటివరకు రూ.4.50 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడింది. దీనికితోడు ఈజిప్టు నుంచి ఉల్లిపాయల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top