వచ్చే ఏడాదికి వెలిగొండ ప్రాజెక్టుకు నీరు

Veligonda Project Water Wil Come to the Next Year - Sakshi

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం: వచ్చే ఏడాదికి వెలిగొండ ప్రాజెక్టు నీరు పశ్చిమ ప్రాంతంలో పారుతుందని, పొలాల్లో పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగానే వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిలు అన్నారు. సోమవారం రైతు దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లుగా వ్యవసాయం నిర్వీర్యమైందని, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అన్నదాతలు తల ఎత్తుకునేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి ఖర్చుల కింద రూ.12,500 జమ చేస్తారని, కనీస మద్దతు ధరలు కూడా ప్రకటించి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే ఐదేళ్లలో అన్నదాతల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. 

కొండేపల్లిని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం 

మండలంలోని కొండేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొండేపల్లి గ్రామంలో విజోత్సవ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మా గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని భరోసా ఇచ్చారు. మా తండ్రి కేపీ కొండారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆదరించడం జరిగిందని, ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేగా చేయడం మీ కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఇటీవల కాలంలో రాజధానిలో కలవడం జరిగిందన్నారు. తొలుత ఈ ప్రాంత వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరామన్నారు. అలాగే శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి మార్కాపురం చెరువును సాగర్‌ వాటర్‌ నింపడానికి కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు.

 మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి మాట్లాడుతూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి కాలంలోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందిందన్నారు. పట్టణంలో ముస్లింలకు షాదీఖానా, హిందువులకు కల్యాణ మండపం, పట్టణంలోని తాగునీటి అవసరాలకు సాగర్‌ పైపులైన్, ప్రస్తుతం టీడీపీ నాయకులు వేసిన సీసీ రోడ్డులు కూడా ఆయన మంజూరు చేయించిన పనులను ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ బుశ్శెట్టి నాగేశ్వర రావు, నాగిశెట్టి, యూత్‌ నాయకులు శివారెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top