
సాక్షి, అమరావతి : పద్నాలుగవ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని.. ఈ విషయం తెలిసిన తరువాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్యాకేజీకి ఒప్పుకోవడం పెద్ద తప్పు అని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ప్యాకేజీలో అమరావతి నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదువందల కోట్లు ఇస్తామంటే చంద్రబాబు నోరు మూసుకు కూర్చున్నారని విమర్శించారు. రాజధాని కోసం ఎక్కువ నిధులు కావాలంటూ చంద్రబాబు ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు.
ఏపీలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్, బొలంగీ తరహాలో నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టుపట్టలేదని ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టు విషయంలోను చంద్రబాబు అలసత్వం వహించారని వడ్డే ధ్వజమెత్తారు. సాంకేతిక సమస్యల కారణంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయలేమని కేంద్రం చెబితే రామాయపట్నంలో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగలేదని నిలదీశారు. రామాయపట్నం పోర్టు నిర్మించమని అడిగితే ఈ సమయానికి 24వేల కోట్లతో ఈపాటికే పోర్టు పనులు జరుగుతుండేవని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని, అభివృద్ది వికేంద్రీకరణ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పైనే దృష్టి పెడుతోందని ద్వజమెత్తారు. గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయటానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి భారీ స్థాయిలో అప్పలు తీసుకురావటం దారుణమైన విషయమని ధ్వజమెత్తారు. ఈ నెల 22న చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలపై తాను రాసిన 'నేలవిడిచి సాము చేయటం తుగునా..' అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.