 
													సాక్షి, అమరావతి: గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా లేకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో నాలుగేళ్లుగా వరద ప్రవాహం తగ్గడంపై నివ్వెరపోతున్నారు. అక్టోబర్ మూడో వారం నుంచి ఫిబ్రవరి వరకు నదీలో కనీసం 75 నుంచి 80 టీఎంసీల లభ్యత ఉండేది. సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నిల్వ ఉన్న నీటితోనే గోదావరి డెల్టాలో రబీ సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.నాలుగేళ్లుగా గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. రబీ పంటల సాగు సవాల్‌గా మారింది.
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోదావరిలో 23 నుంచి 25 టీఎంసీల నీటిలభ్యత మాత్రమే ఉండడంతో డెల్టాలో పూర్తిస్థాయిలో పంటలు సాగుచేయలేని దుస్థితి నెలకొంది. పోలవరం పూర్తయితే తప్ప డెల్టాలో పూర్తిస్థాయిలో రబీ పంటల సాగుకు అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన ఒకట్రెండు వారాల్లోనే పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల గోదావరి నదిలో వరద ప్రారంభమవుతుంది. గోదావరి నదీ జలాలు ధవశేళ్వరం బ్యారేజీ మీదుగా ఏటా సగటున 2,500 నుంచి మూడువేల టీఎంసీలు సముద్రంలో కలిస్తే.. సింహభాగం జూలై నుంచి సెప్టెంబరు వరకు వచ్చే వరద కావడం గమనార్హం.
గత నాలుగేళ్లలో 2016–17లో మినహా మిగతా మూడేళ్లలో వరద జలాలు పెద్దగా సముద్రంలో కలవలేదు. నదీ పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా ఏకరీతిలో వర్షాలు కురిస్తే.. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ..ఊట ద్వారా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోదావరి డెల్టాలో రబీ సాగుకు అవసరమైన 83 టీఎంసీలు సహజసిద్ధంగా లభించేవి. సమృద్ధిగా వర్షాలు కురకపోవడం వల్ల అక్టోబర్ నుంచి సహజసిద్ధంగా లభించే జలాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది 25 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేకపోవడంలో రబీ పంటల సాగు సవాల్‌గా మారింది. సీలేరు, డొంకరాయి జలాశయాల్లోని జలాలతోపాటు డ్రెయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసినా పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఉంది.
సంవత్సరం    సముద్రంలో కలిసిన జలాలు(టీఎంసీల్లో)
 
2008–09    1,819.196
2009–10    742.865
2010–11    4,014.772
2011–12    1,538.065
2012–13    2,968.816
2013–14    5,827.475
2014–15    2,006.205
2015–16    1,611.490
2016–17    2,896.056
2017–18    1,024.978

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
