ఉద్యమం.. మహోద్ధృతం | united andhra pradesh movement | Sakshi
Sakshi News home page

ఉద్యమం.. మహోద్ధృతం

Sep 13 2013 3:26 AM | Updated on Sep 1 2017 10:39 PM

సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మహోద్ధృతంగా కొనసాగుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కర్షక, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు

 కర్నూలు, న్యూస్‌లైన్:
 సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మహోద్ధృతంగా కొనసాగుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కర్షక, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. కర్నూలులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దిగ్విజయ్‌సింగ్ వేషధారిని బంధించి తాళ్లతో లాగుతూ  నిరసన తెలిపారు. ఆదోనిలో సంప్రదాయ దుస్తుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శనలు, రాస్తారోకో నిర్వహించారు. న్యాయవాదులు సమైక్యాంధ్రకు మద్దతుగా పురవీధులలో ప్రదర్శన చేశారు. విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన, రాస్తారోకో కేంద్ర ప్రభుత్వ సంస్థలను బంద్ చేయించారు. 72గంటలు నిరవధిక సమ్మెలో భాగంగా డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయానికి తాళం వేసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
 
 జేఏసీ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులు దీక్షల్లో పాల్గొన్నారు. ఆస్పరి మండలం చిగిళి గ్రామానికి చెందిన కళాకారుడు నాగలింగమయ్య వీరభధ్ర స్వామి అవతారంలో ప్రదర్శన నిర్వహించారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో సోనియా, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రుల మాస్క్‌లతో ‘అమ్మ చేతిలో కీలు బొమ్మలు’నాటకం నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రుద్రవరంలో మహిళా సర్పంచుల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఆలూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరహార దీక్షలు చేపట్టారు. దేవనకొండలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు రిలే నిరహార దీక్షల్లో పాల్గొన్నారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
 
  వెలుగోడులో వికలాంగులు, రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. సి.బెళగల్ లో మత్స్యకారులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. గూడూరు పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో వివిధ రూపాల వేషాలతో ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించారు. కోడుమూరులో చిన్న వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరాహార దీక్షకు కూర్చున్నారు. పత్తికొండలో ప్రభుత్వ మెడికల్ మహిళా ఉద్యోగులు దీక్షల్లో పాల్గొన్నారు. శాంతి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మద్దికెరలో జేఏసీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వ చౌకదుకాణ డీలర్లు స్టేషన్ నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరు మున్సిపల్ మాజీ చెర్మైన్, వైఎస్సార్సీపీ నాయకుడు బుట్టా రంగయ్య స్థానిక సోమప్ప సర్కిల్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు.
 
  ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. పీఈటీలు, పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం స్థానిక సోమప్ప సర్కిల్‌లో కదం తొక్కారు. మానవహారంగా ఏర్పడి మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు డ్రామాలు ఆడకుండా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని ఆర్‌ఎస్ రోడ్డుకు చెందిన కొందరు యువకులు వినాయకునికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement