ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ

Underground drainage in each municipality says YS Jagan - Sakshi

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

తాగునీరు,డ్రైనేజీ, విద్యుత్తు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలదే

తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా ఉండాలి

వరద నీటికి అడ్డుగా అక్రమ కట్టడాలతో దుర్భర పరిస్థితులు

పర్యావరణ, నదీ పరీవాహక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి

కృష్ణా కరకట్ట, కాల్వ గట్లపై ఉన్న పేదలకు ఉచితంగా ఇంటి నిర్మాణం

తాడేపల్లి, మంగళగిరిల్లో ఇళ్లులేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

తాడేపల్లిలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

మున్సిపల్‌ కార్యాలయాల్లో లంచాల పేరు వినపడకూడదు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్ధాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై ముఖ్యమంత్రి జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై సీఎం సమీక్షించారు.

అక్రమ కట్టడాలతో దుర్భర పరిస్థితులు...
వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో అంతా చూస్తున్నామని, కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నగరాల్లో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని, మనం అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదన్నారు. వరదనీరు ప్రవహించే మార్గాల్లో అక్రమ నిర్మాణాల కారణంగా పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయని, కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలతో మనమే సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పైగా వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా కూడా రాదని, చట్టాలు కూడా దీనికి అంగీకరించవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదలు, సామాన్యుల పట్ల ఉదారంగా వ్యవహరించి, వారికి కావాల్సిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలంగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు 

సమస్యలు తీర్చేలా సచివాలయాలు..
పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదని, వీటి విషయంలో వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, విద్యుత్తు, రేషన్‌కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ లాంటివి సమకూర్చే బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చేలా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండాలన్నారు. ఎలాంటి విజ్ఞప్తులు అందినా పరిష్కరించేలా ఉండాలని పేర్కొన్నారు. 

ఆదర్శ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి
రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరిని ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లి, మంగళగిరిలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని, తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, భూగర్భ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు తదితర మౌలిక వసతులతో పాటు ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పించాలని సీఎం సూచించారు. పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాల్టీలు సాధ్యమన్నారు. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. మున్సిపల్‌ కార్యాలయాల్లో లంచాల పేరు కూడా వినపడకూడదని హెచ్చరించారు. ఏ పౌరుడూ, ఏ బిల్డరూ లంచం ఇచ్చి పనులు చేయించుకునే దుస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. 

కరకట్ట పేదలకు ఉచితంగా ఇళ్లు...
కృష్ణా నది కట్టమీద, కరకట్ట లోపల, కాల్వ గట్ల మీద నివసిస్తున్న వారికి ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఉగాది నాటికి వారికి పట్టాలు ఇచ్చి మంచి డిజైన్‌తో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. వారి సమస్యను శాశ్వతంగా తీర్చాలన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర స్థలం కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. ఎక్కడో దూరంగా కాకుండా వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, నదీ పరీవాహక చట్టాల అమలు కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. బకింగ్‌ హాం కెనాల్‌ కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని కాల్వ గట్లపై  విస్తారంగా చెట్లను పెంచాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top