సెల్‌ఫోన్‌ సిమ్‌ల భద్రత డొల్లేనా..?

Two SIM Cards Working Same Number After Portability - Sakshi

ఒకే నెంబర్‌పై రెండు ప్రొవైడర్‌లు

రెండింటిలోనూ కాల్స్, కాన్ఫరెన్స్‌లు

అయోమయంలో వినియోగదారులు

పశ్చిమగోదావరి  , ఏలూరు (టూటౌన్‌): మనం వినియోగిస్తున్న సెల్‌ ఫోన్‌ సిమ్‌ల భద్రత డొల్లేనా..? అనే అనుమానం వినియోగదారుల్లో వ్యక్త మవుతోంది. ఒక సర్వీస్‌ నుంచి మరో సర్వీస్‌కు పోర్టబులిటీ ద్వారా మారినా రెండు సర్వీసులు పనిచేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించి రీచార్జ్‌ అవడం, కాల్‌ వెయిటింగ్‌ రావడం, ఆఖరుకు కాన్ఫరెన్స్‌ కాల్స్‌ కలవడంతో ఇదేమీ విచిత్రమంటూ వినియోగదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా పోర్టబులిటీ ద్వారా వేరే నెట్‌ వర్క్‌కు మారేటప్పుడు గతంలో ఉన్న నెట్‌ వర్క్‌ కట్‌ అయిన తర్వాతనే కొత్తగా తీసుకున్న నెట్‌ వర్క్‌ మనుగడలోకి వస్తుంది. కానీ ఏలూరులో పై విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగిందంటే..
ఏలూరు రామచంద్రరావు పేటకు చెందిన కేవీ శేఖర్‌ అనే వ్యాపారి వారం క్రితం తను వాడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ నెంబర్‌ను ఎంఎన్‌పీ(పోర్టబులిటీ) ద్వారా జియో నెట్‌వర్క్‌లోకి మారాడు. రీచార్జ్‌ కూడా చేయించాడు. ఈ సందర్భంగా జియో నెట్‌ వర్క్‌ నిర్వాహకులు మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ వర్క్‌ కట్‌ అయిన వెంటనే మారిన జియో నెట్‌ వర్క్‌ పనిచేస్తుందని చెప్పారు. మారిన నాలుగు రోజులకు అనగా శనివారం ఉదయం నుంచి జియో నెంబర్‌ 94403 29002 పనిచేస్తుంది. అయితే విచిత్రంగా కట్‌ అవ్వాల్సిన బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సైతం ఇదే నెంబర్‌పై పనిచేస్తుండటంతో ఇదెలా సాధ్యమంటూ ఆ వినియోగదారుడు విస్తుపోయాడు. అంటే ఈ లెక్కన మనం ఇచ్చే వివరాలు ఆయా సెల్‌ఫోన్‌ సంస్థల వద్ద భద్రమేనా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై టెలికాం అధికారిని వివరణ కోరగా ఒకే నెంబర్‌పై రెండు నెట్‌ వర్క్‌లు పనిచేయడం సాధ్యం కాదని, ఎక్కడో ఏదో లోపం జరిగిందంటూ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top