మిస్టరీగా మారిన జంట హత్యలు

Two Murder Case Mystery In East Godavari District - Sakshi

పోలీసుల ముమ్మర దర్యాప్తు

కుటుంబ సభ్యులపైనే అనుమానం

గుట్టు పట్టిస్తున్న సీసీ కెమెరాలు

సాక్షి, రామచంద్రపురం: అత్యంత కిరాతకంగా హత్యకు గురైన తల్లీకూతుళ్ల జంట హత్యల కేసు మిస్టరీగా ఉంది. హత్య జరిగిన రెండో రోజు కూడా హంతకులు ఎవరనేది తెలియరాలేదు. పేదరికంతో ఉన్న ఈ కుటుంబంలో ఎందుకు హత్యలకు పాల్పడ్డారనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. రామచంద్రపురం పట్టణంలో చప్పిడివారి సావరంలో దండుగంగమ్మ గుడి వీధిలో ఒక ఇంట్లో రక్తపు గాయాలతో హత్యకు గురైన బలసా మాధవి, బలసా కరుణల హత్యకేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన నాటి నుంచి రామచంద్రపురం డీఎస్పీ ఎం రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో సీఐ పెద్దిరెడ్డి శివగణేష్‌ మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి హంతకుల

కోసం గాలిస్తున్నారు. 
హత్య జరిగిన రాత్రి నుంచి మృతురాలి మాధవి కుమారుడు విజయ్, భర్త శ్రీనివాసులు ఆచూకీ కనిపించకపోవడంతో వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాకినాడలోని ఒక హోటల్‌లో పని చేసే తండ్రీకొడుకులు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. హత్య జరిగిన రాత్రి కొడుకు విజయ్‌ రావడం అనంతరం ఉదయానికి కనిపించకుండా పోవడం కూడా పోలీసులు విజయ్‌పైనే అనుమానంతో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

అనుమానంగా సీసీ టీవీ ఫుటేజీలు
హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీస్‌ డాగ్‌ బ్రాడీపేట రోడ్డు మీదుగా ప్రధాన రహదారిలోకి వచ్చి నిలిచిపోయింది. అయితే ఈ రహదారిలో పోలీసులు షాపుల్లోను విద్యా సంస్థల్లో పెట్టిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్టు తెలిసింది. ఈ సీసీ టీవీ ఫుటేజీలో హత్య జరిగిన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అదే రోడ్డులో ఒక వ్యక్తి సైకిల్‌మీద వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వెళుతున్న దృశ్యాలు రికార్డు అయినట్టు పోలీసులు గమనించారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య జరిగిన రాత్రి సైకిల్‌ మీద వచ్చిన మృతురాలు మాధవి కుమారుడు విజయ్‌ ఉదయానికి సైకిల్‌తో పాటు కనిపించకపోవడం, సీసీ టీవీ ఫుటేజీల్లో అదే రోడ్డులో సైకిల్‌ మీద వెళుతున్న వ్యక్తి ఉండడం పలు

అనుమానాలకు తావిస్తోంది. 
మృతురాలు మాధవి సోదరుడు సోమవారం రామచంద్రపురం చేరుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం బల్లిపాడుకు చెందిన గుండా బత్తులు వెంకన్న మృతురాలు మాధవికి అన్నయ్య అవుతాడు. పోలీసుల సమాచారం మేరకు అతడి రక్తసంబంధీకులతో కలసి వెంకన్న రామచంద్రపురం వచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి వారికి అప్పగించారు. అయితే వెంకన్న పోలీసులకు కొంత సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మాధవి భర్త శ్రీనివాసు తన కుమారుడు విజయ్‌తో కలిసి కాకినాడలో నివసిస్తూ భార్య, కుమార్తెను పట్టించుకునేవాడు కాదని, తరచూ తన వద్దకు డబ్బుల కోసం వేధించేవాడని చెప్పినట్టు తెలిసింది. రెండేళ్ల క్రితం శ్రీనివాసు కాకినాడలో మరో పెళ్లి కూడా చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసినట్టు సమాచారం.

తరచూ భార్య మాధవి, కుమార్తె కరుణ వద్దకు వచ్చిన భర్త శ్రీనివాసు డబ్బుల కోసం వేధించేవాడని ఆ కోణంలోనే కుమారుడు, విజయ్‌తో కలిసి వీరిద్దరినీ హతమార్చాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతురాలు కరుణ తణుకులో ఓ కళాశాలలో చదువుతూ మధ్యలోనే నిలిపి రామచంద్రపురం ఇంటికి వచ్చేసిందని తెలుస్తోంది. తణుకులోని ఆమె కుటుంబీకుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్న కరుణ ఎందుకు అర్ధంతరంగా చదువును విరమించిందనేది తెలియాల్సి ఉంది. దీంతో ఆమెకు ప్రేమ వ్యవహారం ఏదైనా నడించిందా? లేక కుటుంబ కలహాల నేపథ్యంలో హత్యలు జరిగాయా? అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

దహనసంస్కారాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
రామచంద్రపురం: పట్టణంలోని చప్పిడివారిసావరంలో జరిగిన జంట హత్యల్లో మృతురాళ్లకు అంత్యక్రియల నిర్వహణకు ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ తమ తనయుడు నరీన్‌ ద్వారా ఆర్థిక సహకారం అందజేశారు. పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుని వారికి సమాచారం అందించారు. మృతురాలు బలసా మాధవి సోదరుడు గుండా బత్తుల వెంకన్నకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు. వారు కడుపేద వారు కావటంతో దహన సంస్కారాలకు కూడా సొమ్ములు లేవు. కాజులూరు మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ విషయాన్ని తెలుసుకుని ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే వేణు అదేశాల మేరకు ఆయన తనయుడు నరీన్‌ మృతుల కుటుంబసభ్యులకు సొమ్ములు అందజేశారు. దాంతో వారు మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top