ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కళాశాల వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.
అనంతపురం క్రైం : ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కళాశాల వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. తిరిగి ఇంటికెళ్లే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అనంతపురం నగరంలోని నలంద జూనియర్ కళాశాలలో మధుసూదన్‌గౌడ్, శివకుమార్ ఇంటర్ చదువుతున్నారు. బుధవారం గుత్తి రోడ్డులోని నలంద రెసిడెన్షియల్ కళాశాలలో వార్షికోత్సవం జరిగింది.
ఈ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు వేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం ద్విచక్రవాహనంలో ఇంటికి బయలుదేరారు. గుత్తి రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొన్నారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మధుసూదన్‌గౌడ్‌ను బెంగళూరుకు తరలించారు. శివకుమార్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కాగా..మద్యం మత్తులో బైకు నడిపినట్లు తెలిసింది. వేడుకల సమయంలో కూడా ఈ ఇద్దరితో పాటు మరికొందరు అధ్యాపకులతోనూ గొడవ పడినట్లు సమాచారం. ఫూటుగా మద్యం తాగి రావడంతో కళాశాల యాజమాన్యం వీరిని వేడుకల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక అధ్యాపకుడు వీరిపై చేయి కూడా చేసుకున్నారు. ఎలాంటి గొడవలు చేయబోమని వెనుకవైపు కూర్చుని వేడుకలు తిలకిస్తామని విన్నవించడంతో యాజమాన్యం అనుమతించింది. ఈ క్రమంలో వేడుకలు ముగిసిన తర్వాత బైకులో విన్యాసాలు చేసుకుంటూ వచ్చినట్లు సమాచారం.