ప్రేమ విఫలమై యువతుల ఆత్మహత్య

Two girls commit suicide In Love Failure at Guntur District - Sakshi

యుక్త వయసులో వచ్చిన ఆకర్షణే ప్రేమని భావించారుగానీ.. 18 ఏళ్లపాటు గుండెలపై పెట్టుకుని పెంచుకున్న తల్లిదండ్రుల ప్రేమను గుర్తించలేకపోయారు.. తాము కోరుకున్న వ్యక్తి లేకుండా బతకలేమని తలచారుగానీ.. బిడ్డలు లేకుండా ఒక్క క్షణమైనా అమ్మానాన్నల గుండె కొట్టుకోదని ఆలోచించలేకపోయారు.. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రులు.. తమ ప్రేమను అర్థం చేసుకోరని అపోహపడ్డారుగానీ.. పిల్లలు లేకపోతే అమ్మానాన్నల జీవితానికి వెలుగు లేదనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు.. క్రోసూరు మండలం గుడిపాడు, సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామాల్లో ఇద్దరు యువతులు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు.

గుంటూరు జిల్లా/ సత్తెనపల్లి: ప్రేమ విఫలమై ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం క్రోసూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందని నంబూరినాగ తిరుతపతమ్మ (19) అదే గ్రామానికి చెందిన ముక్కాల నాగ సురేష్‌ను ప్రేమించింది. అయితే నాగసురేష్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో మనస్తాపానికి గురైన నాగ తిరుపతమ్మను సత్తెనపల్లి మండలం వెన్నాదేవిలో నివశిస్తున్న చిన్నమ్మ చింతల వెంకటలక్ష్మి వద్దకు పంపారు. డీఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పటికీ నాగతిరుతపమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో సత్తెనపల్లి పట్టణపోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు  చేశారు. 

ఇది ఇలా ఉంటే చింతల వెంకటలక్ష్మి కుమార్తె చింతల రవళి (18) మేనమామ కుమారుడైన కోటేశ్వరరావును ప్రేమించింది. తల్లిదండ్రులు ఆ ప్రేమను అంగీకరించి వివాహం చేయరని రవళి భావించింది. దీంతో నాగ తిరుపతమ్మ, రవళిలు మాట్లాడుకుని ఈనెల 25న రాత్రి సమయంలో శీతల పానియంలో ఎలుకల మందు కలుపుకొని ఆత్మహత్యకు యత్నించారు. నాగతిరుపతమ్మ అదే రోజు మృతిచెందగా రవళి ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండడంతో హుటాహుటిన సత్తెనపల్లిలోని ప్రైవేట్‌ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top