భయం గుప్పిట్లో వెంకటాపురం

Two Corona Positive Cases Registered In Venkatapuram Visakha District - Sakshi

 లండన్‌ నుంచి వచ్చిన యువకుడి 

తండ్రికి కూడా కరోనా పాజిటివ్‌  

గ్రామంలో రెండుకు చేరిన కేసులు 

పోలీసుల ఆధీనంలో గ్రామం  

పద్మనాభం(భీమిలి): మండలంలోని వెంకటాపురం గ్రామస్తులు భయం గుప్పెట్లో ఉన్నారు. గ్రామంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, అధికారులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఎవరూ రాకుండా కట్టడి చేశారు. లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి ఇప్పటికే పాజిటివ్‌ వచ్చింది. తాజాగా ఆయన తండ్రికి కూడా పాజిటివ్‌ నమోదైంది.

వెంకటాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్నాడు. లండన్‌లోని బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీ మీదుగా విశాఖ విమానశ్రయానికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఈ నెల 17న పద్మనాభం మండలంలో ఉన్న తన సొంత గ్రామమైన వెంకటాపురం వచ్చాడు. 20న కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. 21న విశాఖపట్నం చెస్టు ఆస్పత్రిలో చేరాడు. 22న ఇతనికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో యువకుడు కుటుంబంలోని నలుగురితో పాటు మొత్తం 23 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి పాజిటివ్‌రావడంతో 21 మంది గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  తాజాగా యువకుడు తండ్రి(54)కి కరోనా పాజిటివ్‌గా  వైద్యులు నిర్ధారించారు.  దీంతో శుక్రవారం మరో 10 మందిని ఐసోలేషన్‌కు తరలించారు.

వైద్య బృందాల ఆరా 
దీంతో యువకుడు తండ్రి ఎవరెవరిని కలిశాడో వైద్య శాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే రేవిడి ఆస్పత్రికి ఎదురుగా ఉన్న హార్డ్‌ వేర్‌ షాపు వద్దకు వెళ్లడంతో పాటు అనేక మందిని  కలిశాడు. ముందుస్తుగా అనుమానంతో  పది మందిని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. వెంకటాపురంలో కరోనా కల్లోలం సృష్టించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరికి కరోనా వైరస్‌ సోకుతుందోనని ప్రజలు భయ కంపితులవుతున్నారు.  రేవిడి, పాండ్రంగి సచివాలయ పరిధిలోని పది గ్రామాల్లో వలంటీర్లు , ఆశలు 50 బృందాలుగా ఏర్పడి రీ  సర్వే చేస్తున్నారు.

కొనసాగుతున్న ఇంటింట సర్వే
మండలంలోని 22 పంచాయతీ పరిధిలో ఆశలు, వలంటీర్లు ససర్వే చేశారు.  గ్రామాల్లోకి  ఇతర రాష్ట్రాల నుంచి 165 మంది, విదేశాల నుంచి పది మంది వచ్చినట్టు గుర్తించారు. వీరంతా ఇళ్లలోనే ఉండాలని వైద్య శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు సూచించారు. వెంకటాపురం గ్రామంలోకి  ఇతరులను ఎవరనీ వెళ్లనివ్వలేదు.  

   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top