కూర్మాలకు గడ్డు కాలం

Turtles Suffering in Uppada Beach East Godavari - Sakshi

తీరం లేక ‘గుడ్లు’ తేలేస్తున్న వైనం

రాళ్ల మధ్య నలిగిపోతున్న సముద్ర తాబేళ్లు

మృత కళేబరాలతో నిండిన ఉప్పాడ తీరం

తూర్పుగోదావరి, పిఠాపురం: పర్యావరణ పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషించే సముద్ర తాబేళ్లకు గుడ్లు పెట్టే కాలం గడ్డుకాలంగా మారింది. కాకినాడ సమీపంలో ఉప్పాడ సాగరతీరం కొట్టుకుపోవడంతో గుడ్లు పెట్టేందుకు స్థలం లేక తాబేళ్లు సముద్రకోతకు రక్షణగా వేసిన రాళ్లకు కొట్టుకుని విగతజీవులుగా మారుతున్నాయి. ఏటా డిసెంబర్‌ నెల నుంచి ఫిబ్రవరి వరకు అనేక ప్రాంతాల నుంచి గుడ్లు పొదిగేందుకు ఈ తీరానికి వందల సంఖ్యలో సముద్ర తాబేళ్లు వలస వస్తుంటాయి. అవి రాత్రి సమయాల్లో తీరానికి చేరుకుని గోతులు తవ్వి గుడ్లు పొదిగి మళ్లీ ఆ గోతులను ఇసుకతో పూడ్చి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. ఆ గుడ్లు పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళుతుంటాయి.

ఈ పరిణామంలో తీరంలో ఇసుక తిన్నెల్లో పెట్టిన గుడ్లు కొన్ని నక్కలు, కుక్కలు తినేస్తుండగా తాబేళ్ల సంతతికి రక్షణ లేకుండా పోయింది. గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చిన తాబేళ్లు మత్స్యకారులు తీరం వెంబడి సాగించే అలివి వేటలో వలలకు చిక్కి చనిపోతున్నాయి. ప్రస్తుతం ఈ తాబేళ్లకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అసలు గుడ్లు పెట్టడానికి వాటికి ఇసుక తిన్నెలే కరువయ్యాయి. తీరంలో ఎక్కడ చూసినా సముద్ర కోతకు రక్షణగా వేసిన రాళ్లు మాత్రమే ఉండడంతో సంతానోత్పత్తి కోసం వచ్చిన తాబేళ్లు ఈ రాళ్లకు కొట్టుకుని మృత్యువాత పడుతున్నాయి. భవిష్యత్తులో వాటి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తుండడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మత్స్యకారుల్లో అవగాహన కల్పించడంతో పాటు తీరంలో రక్షణ చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top