గంజాయి తోటల్లో ఉద్యాన వన సిరులు | Tribals Focused On The Cultivation Of Horticultural Crops | Sakshi
Sakshi News home page

గంజాయి తోటల్లో ఉద్యానవన సిరులు

Nov 30 2019 7:59 AM | Updated on Nov 30 2019 7:59 AM

Tribals Focused On The Cultivation Of Horticultural Crops - Sakshi

వీసమామిడి ప్రాంతంలో గంజాయి తోటల భూముల్లో ఈ ఏడాది విరగ్గాసిన చోడిపంట

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/పాడేరు: పదేళ్లుగా విశాఖ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో సంప్రదాయ పంటల కంటే గంజాయి సాగు వైపే అమాయక గిరిజనులు మొగ్గుచూపుతున్న పరిస్థితి నెలకొందనేది ఎవరూ ఔనన్నా కాదన్నా వాస్తవమే. విచ్చలవిడి గంజాయి సాగు, రవాణాతో అన్నెం పున్నెం ఎరుగని గిరిపుత్రులు పోలీసు, ఎక్సైజ్‌ కేసులకు బలికాగా... దళారులు, స్మగ్లర్లు, వ్యాపారులు మాత్రం రూ.కోట్లకు రూ.కోట్లు వెనకేసుకున్నారు. అందుకే నిషేధిత గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు ఆ స్థానంలో గిరిజనులకు ఉద్యానవనపంట సాగుపై అవగాహన కల్పించాలని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తొలినాళ్ల నుంచే కృతనిశ్చయంతో అడుగులు వేసింది. గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం అమలు చేస్తూ వచ్చింది. ఎక్కడికక్కడ పంటలను ధ్వంసం చేస్తూ రవాణాదారులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించింది. మరోవైపు స్వచ్ఛందంగా సాగు విరమించిన గిరిజనులకు లెక్కకు మించిన ప్రోత్సాహకాలు అందిస్తోంది.

పదివేల నుంచి ఏడు వేలకు తగ్గిన సాగు..
పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీ.కే.వీధి. హుకుంపేట డుంబ్రిగుడ మండలాల్లోని మారుమూల గ్రామాలు గంజాయి సాగుకు కేంద్రాలు మారిపోయాయనే సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా సగటున ఏడాదికి 10వేల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగయ్యేది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది సాగు 3వేల ఎకరాలకు తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎక్కడెక్కడ గంజాయి సాగును వదిలేశారంటే..
పాడేరు మండలంలోని ఇరడాపల్లి, గొండెలి, బడిమెల, కించూరు, హుకుంపేట మండలంలోని  జర్రకొండ, జి.మాడుగుల మండలంలోని బీరం,  గెమ్మెలి, వంజరి, వంతాల, గడుతూరు పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలోను గిరిజనులు గంజాయి సాగును పూర్తిగా వదిలిపెట్టారు.

గంజాయి సాగు బదులు
గంజాయి సాగుకు  పేరొందిన పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ బొడ్డాపుట్టు, సరియాపల్లి. వీసమామిడి గ్రామాల్లోని కొన్ని గిరిజన కుటుంబాలు ఈ ఏడాది నుంచి గంజాయి సాగు వదిలివేశాయి. గతంలో నిషేధిత పంట సాగు చేసిన భూముల్లో  ఇప్పుఉ  వరి, రాజ్‌మా, చోడి. పసుపు  పంటలను సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో  వరిపంట దిగుబడులు అధికంగా ఉండడంతో ప్రస్తుతం  ధాన్యం నూర్పుల పనుల్లో  నిమగ్నమయ్యారు. ఇక రాజ్‌మా పంట సేకరణ దశలో ఉంది. మరికొందదరు  పసుపు పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు.

ఏజెన్సీలో 90 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ
ఏజెన్సీలో గిరిజనులకు 90శాతం రాయితీపై రాజ్‌ మా చిక్కుళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఖరీ ఫ్‌ సీజన్‌లో 2200 క్వింటాళ్ళ విత్తనాలు సరఫరా చేశాం. ఏజెన్సీలో పంటల సాగుకు గిరిజనులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తాం.
– ఎ.మల్లికార్జునరావు, వ్యవసాయశాఖ జేడీ

రూ.82 కోట్లతో ప్రత్యేక పంటల ప్రణాళిక
గంజాయి సాగును వదిలి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు రూ.82 కోట్లతో ప్రత్యేక పంటల ప్రణాళిక రూపొందించాం. విశాఖ మన్యంలో వంద శాతం గంజాయి సాగు నిర్మూలనకు ఎక్సైజ్, పోలీసు శాఖలతో కలిసి సమన్వయంగా చర్యలు చేపట్టాం. 
– డి.కె బాలాజీ, ఐటీడీఏ పీవో

ఇక గంజాయి జోలికి పోం..
మెట్ట భూములలో గంజాయి సాగును వదిలిపెట్టి, ఈఏడాది ప్రభుత్వం పంపిణీ చేసిన 90శాతం సబ్సీడి విత్తనాలను సద్వినియోగం చేసుకుని రాజ్‌మా పంటను సాగు చేసాం. రాజ్‌మా పంటకు వాతావరణ పరిస్థితులు కలిసి రావడం ఎంతో మేలు చేసింది. పంట సేకరణ చేపట్టి, మరో వారం రోజులలో రాజ్‌మా గింజల అమ్మకాలు చేస్తాం. వచ్చే ఏడాది కూడా రాజ్‌మా,ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తాం. ఇక భవిష్యత్తులో గంజాయి జోలికి పోం
– గల్లెలి నాగరాజు, ఈ.బొడ్డాపుట్టు గ్రామం, ఇరడాపల్లి పంచాయతీ, పాడేరు మండలం

ప్రభుత్వ అండతో మాకు భయంపోయింది
గంజాయి సాగును వదిలిపెట్టి మా భూములలో ఈ ఏడాది చోడిపంటను విస్తారంగా సాగు చేశాం. పంట సాగు ఆశాజనకంగా ఉండడంతో పంట సేకరణ చేపడుతున్నాం, విరగ్గాసిన వరికంకులతో దిగుబడి బాగుంది. భవిష్యతులో కూడా తమ వ్యవసాయ భూములలో వాణిజ్య పంటలను సాగు చేస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో  భయం పోయింది.
– మర్రి రాజు, వీసమామిడి గ్రామం

అందరమూ ఒకే మాటగా గంజాయి వదిలేశాం..
గంజాయి తోటల సాగును ఈఏడాది పూర్తిగా వదిలిపెట్టాం. గంజాయి సాగు చేపట్టే సమయంలో ప్రతిక్షణం భయంతో బ్రతికేవాళ్ళం. ఇప్పుడు అధికారుల అండతో గ్రామస్తులంతా ఐక్యమై ఒకే మాట అనుకుని గంజాయి సాగుకు దూరమయ్యాం. వచ్చే ఏడాది నుంచి కాఫీ తోటలు సాగు చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాదికి  ప్రభుత్వ సాయంతో నీడనిచ్చే సిల్వర్‌ఓక్‌ మొక్కలను 50ఎకరాలలో నాటుకున్నాం.
– కిల్లో సాలో, గిరిజన మహిళా రైతు, వీసమామిడి

ఉద్యానవన పంటల సాగుపై దృష్టి పెట్టాం..
గిరిజనులు ఉద్యానవన పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కాఫీ, రాజ్‌మా, కూరగాయలు, స్వీట్‌ ఆరెండ్, పైన్‌ యాపిల్‌వంటి పండ్ల మొక్కల సాగు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రీన్‌ కాలిఫ్లవర్‌ –బ్రకోలీ, పర్పల్‌ కలర్‌ క్యాబేజీ, చైనీస్‌ క్యాబేజీ, జుకుని–దోసకాయలు వంటి విదేశీ కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నాం. జనవరి, ఫిబ్రవరిలో 50 వేల యాపిల్‌ మొక్కల ప్లాంటేషన్‌ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏడాది పసు పు, అల్లం పంటలను ఏజెన్సీలో పెద్దమొత్తంలో సాగు చేయించాలని భావిస్తున్నాం. గంజాయి సాగు వదిలేసిన రైతులు ఇతర పంటల సాగుకు పవర్‌ టిల్ల ర్లు, పవర్‌ వీడర్లు, స్ప్రేయర్లు అడిగారు. ఆ మేరకు అందిస్తాం.
– ప్రభాకర్‌రావు, ఉద్యానవనశాఖ ప్రత్యేక అధికారి, ఐటీడీఏ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement