పారదర్శక పాలన జగన్‌తోనే సాధ్యం

Transparent Rule Is Possible Only With Jagan - Sakshi

సాక్షి, కొవ్వూరు: కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు తానేటి వనిత. ఏడేళ్లుగా ఇక్కడి ప్రజలతో ఆమె అంతగా మమేకమయ్యారు. ఉచిత ఇసుక పాలసీ మాటున టీడీపీ నేతల అక్రమ వ్యాపారాలపై పోరాటాలు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా మద్యం ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయించడంపై, బెల్టుషాపులు నియంత్రణపై ఆమె ఎనలేని పోరాటం సాగించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల తరఫున ఆమె ఆందోళనలు చేశారు. కొవ్వూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న తానేటి వనిత అంతరంగం ఆమె మాటల్లోనే.. 

నీతివంతంగా పనిచేశాం
పదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను. నాతండ్రి బాబాజీరావు పదేళ్లు (రెండుసార్లు) ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏనాడు చిన్న అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేశాం. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో రాజకీయాల్లో రాణించగలుగుతున్నాం. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీచేశాను. విజయానికి దూరమైనా ప్రజల మనస్సుకి ఎంతో దగ్గరయ్యాను. ఎల్లప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. టీడీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గాన్ని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చారు. ఇసుక, మద్యం మాఫీయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం ద్వారా ప్రజల్లో మంచిస్థానం సంపాదించుకోగలిగాను.

ఇక్కడే పుట్టి పెరిగాను
కొవ్వూరు నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను. కుమారదేవం మా స్వస్థలం. మా బంధువర్గం అంతా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. మా నాన్న ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చాగల్లు మండలం గోపాలపురం నియోజకవర్గం పరిధిలోనే ఉండేది. దీంతో ఈ నియోజకవర్గంతో మా కుటుంబానికి రాజకీయంగాను, బంధుత్వాలపరంగాను అనుబంధం ఉంది. భర్త శ్రీనివాసరావు ఎండీ జనరల్‌ వైద్యనిపుణుడు. తాడేపల్లిగూడెంలో ఆసుపత్రి నడుపుతున్నారు. కుమార్తె ప్రణవీ బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. జగనన్న ఆశీస్సులతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నా. అన్నివర్గాలకు మేలు చేకూర్చేవి నవరత్న పథకాలు. జగన్‌సీఎం అయితే రాష్ట్రానికి మేలు చేస్తాడన్న ప్రజల నమ్మకంతో ఈసారి గెలుపొందడం ఖాయం.

ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యం
కొవ్వూరు చరిత్రలో తొలిసారి మహిళకి సీటు కేటాయించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయించి అన్నీరకాల∙వైద్యసేవలు అందుబాటులోకి తెస్తాం. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకి అధిక ప్రాధాన్యం ఇస్తా. అర్హులందరికీ ఇళ్ల నిర్మాణం. కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటా. ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తా.

జగన్‌తోనే వ్యవస్థలో మార్పు
అన్నీవర్గాలకు పారదర్శకమైన పాలన అందించాలంటే జగన్‌ సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. ఆయన మాట ఇస్తే మడమ తిప్పరని నమ్ముతున్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వాళ్లకే లబ్ధి చేకూర్చుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే జగన్‌ పాలన రావాలి. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 72 గంటల్లో వారి సమస్యలు పరిష్కారిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, పార్టీ చూడమని ప్రకటించారు. 2009లో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందాను. 2012 నవంబర్‌లో పదవి తృణప్రాయంగా విడిచిపెట్టి వైఎస్సార్‌ సీపీలో చేరి జగన్‌ సారథ్యంలో నడుస్తున్నా. అప్పటినుంచి కొవ్వూరు సమన్వయకర్తగా పనిచేస్తున్నా. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top