ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు

Published Fri, Apr 25 2014 2:15 AM

ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు - Sakshi

 ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పార్థివదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు. ఆ తర్వాత భూమా నివాసం నుంచి పాతబస్టాండ్, ఇండోర్‌స్టేడియం, జాతీయరహదారి, చిన్నకందుకూరు రస్తా మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుంది.

 మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జాతీయ రహదారి సమీపంలోని సుద్దపల్లి క్రాస్ రోడ్డు వద్ద సొంత స్థలం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
 
 
 సాక్షి ప్రతినిధి/సాక్షి, కర్నూలు : ఏమ్మా బాగున్నావా.. అన్నా అంతా కుశలమేనా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కలివిడిగా మెలిగిన శోభా నాగిరెడ్డి ఇక లేరనే చేదు నిజాన్ని ఆళ్లగడ్డ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నంద్యాల పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన జనభేరి సభలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. తెల్లారేసరికి అనంతలోకాలకు వెళ్లిపోయారంటే ఏ ఒక్క మనసు అంగీకరించడం లేదు. బుధవారం రాత్రి నంద్యాల నుండి ఆళ్లగడ్డకు తిరుగుప్రయాణమైన ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు.

విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమె క్షేమంగా బయటపడాలని.. ఎన్నికల్లో విజయం సాధించి తమను అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రార్థించారు. కులమతాలకు అతీతంగా తిండీతిప్పలు మానుకొని ఆమె క్షేమ సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఏదైతే వినకూడదనుకున్నారో.. ఆ విషాద వార్తే వారి చెవినపడింది. కష్టసుఖాలను ఇంట్లో మనిషిగా పంచుకున్న
 
 ఆడపడుచు హఠాన్మరణం జిల్లా ప్రజలను దుఃఖసాగరంలో ముంచింది. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి శోభమ్మ మృతదేహం నంద్యాల మీదుగా ఆళ్లగడ్డకు తరలించగా.. రోడ్ల వెంట అభిమానులు బారులు తీరారు. ఆత్మీయ నేత కడసారి చూపునకు పరితపించారు.


 కన్నీరుపెట్టిన నంద్యాల
 ఆత్మీయ నేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి నంద్యాల పట్టణం కన్నీటిసంద్రమైంది. శోభా నాగిరెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా నంద్యాలలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు అభిమానులు, ఆత్మీయుల సందర్శనార్థం అక్కడే ఉంచారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచీ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి కూడా జనం పోటెత్తారు. రాత్రి 9.30 గంటలకు భౌతికకాయాన్ని ఆళ్లగడ్డకు తరలించారు.


 మూగబోయిన ఆళ్లగడ్డ
 శోభా నాగిరెడ్డి పార్థివదేహం ఆళ్లగడ్డకు చేరుకోగానే ప్రజలు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్నం నుండే దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. భూమా నివాసం అభిమానులతో పోటెత్తింది. మిత్రులు, కుటుంబ సభ్యులు ఆప్తులు, సన్నిహితులు.. పార్టీ శ్రేణులతో కిక్కిరిసింది.

ముఖ్యంగా మహిళలు ఈ విషాద ఘటనతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ఎమ్మెల్యేగా తప్పక గెలుస్తుంది. మంత్రి అవుతారని ఆశించాము. ఇలా జరిగిందేంటి తల్లీ’’ అంటూ అభిమానులు బోరున విలపించిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి.

 అంబులెన్స్ నుంచి శవపేటికపైకి ఆమె పార్థివదేహాన్ని చేర్చగానే చిన్నకుమార్తె బొట్టు పెట్టి దీపం వెలిగించి బోరున విలపించడంతో అందరి హృదయాలు ద్రవించుకుపోయాయి. ‘‘అమ్మా.. లేమ్మా అంటూ’’ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. శవపేటికపై తలపెట్టి రోదిస్తున్న కుమారుడిని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు.
 
 ఆ ముగ్గురి ఆవేదన వర్ణనాతీతం
 ఎప్పుడూ చిరునవ్వు.. హుందాతనంతో అందరికీ ధైర్యం చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, స్థానికులకు  ధైర్యం చెబుతూ వచ్చిన ఆయన.. శోభ మరణవార్త తెలియగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని పట్టుకొని రోదించడం అందరినీ కలచివేసింది.

Advertisement
Advertisement