అభివృద్ధికి అధికారులు సహకరించాలని కేంద్రమంత్రి కావూరు సాంబశివరావు సూచించారు. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుతో కలిసి మండలంలోని వేల్పుచర్లలో...
గోసవరం(ముసునూరు) న్యూస్‌లైన్ : అభివృద్ధికి అధికారులు సహకరించాలని కేంద్రమంత్రి కావూరు సాంబశివరావు సూచించారు. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుతో కలిసి మండలంలోని వేల్పుచర్లలో రూ.27 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు, గోపవరం నాగేంద్రస్వామి ఆలయ సమీపంలో 30 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.
గోపవరం నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 16 పంచాయతీల్లో ఉన్న సమస్యలను ఆయా గ్రామ సర్పంచులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్నామని పలువురు రైతులు వాపోయారు. మండలం సరిహద్దుగా తమ్మిలేరు నది ఉన్నప్పటికీ ఇసుక తోలుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. కావూరు స్పందిస్తూ గోపవరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 24 గంటల విద్యుత్ సరఫరా కోసం అవసరమైన లక్ష రూపాయల గ్రాంటుని ఇవ్వడానికి అంగీకరించారు. ముసునూరు మండలంలో 10 గ్రామాల్లోఉన్న వాల్టా చట్టాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానని రైతులకు హామీ ఇచ్చారు.
బదిలీకైనా సిద్ధమే : సబ్ కలెక్టర్
పేదలు నిర్మించే ఇళ్లకు ఇసుక తోలుకోవడానికి అనుమతినివ్వాలని స్టేజీపై ఆయన పక్కనే ఉన్న సబ్ కలెక్టరు చక్రధరబాబుని కావూరు అడిగారు. అనుమతినిస్తే ఇసుక అక్రమంగా రవాణా అవుతుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేనని సబ్‌కలెక్టర్ కావూరుకి తేల్చి చెప్పారు. ప్రజలకు మేలు చెయ్యడానికి నిబంధనలు కొద్దిగా సడలించవచ్చునని కావూరు ఈ సందర్బంగా సబ్‌కలెక్టర్‌కి సూచించారు. ఎక్కడికైనా బదిలిైపై వెళ్లడానికైనా సిద్ధమేనని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేనని సబ్‌కలెక్టర్ తెలపడంతో కేంద్రమంత్రికి, సబ్‌కలెక్టర్ మధ్య కొంతసేపు ఆసక్తికరమైన వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు,తహశీల్దార్ డీఎస్ శర్మ, ఎంపీడీవో జీ రాణీ, ఎంఈవో తోటకూర సాంబశివరావు, కాంగ్రెస్ నాయకులు నందిగం గంగాదరరావు, నందిగం పెరుమాళ్ళు, నందిగం బాబ్జీ, సర్పంచులు, మేరుగు తేరెజమ్మ, నందిగం శ్రీనివాసరావు, పల్లెపాము కుటుంబరావు, రే గుల గోపాలకృష్ణ, సొంగా వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.