తెలంగాణ పాత్రికేయులపై దురుసుగా ప్రవరిస్తూ, వారి అంతుచూస్తానని బెదిరించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెంటనే బేషరుతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ, టీఎస్‌జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ పాత్రికేయులపై దురుసుగా ప్రవరిస్తూ, వారి అంతుచూస్తానని బెదిరించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెంటనే బేషరుతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ, టీఎస్‌జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. లగడపాటి వైఖరిని నిరసిస్తూ వర్సిటీ కళాశాల భవనం ఎదుట గురువారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీఎస్‌జేఏసీ జిల్లా కన్వీనర్ యెండల ప్రదీప్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ప్రశ్నలు అడిగిన పాత్రికేయులను ఎంపీ అయి ఉండి బెదిరించడం సిగ్గుచేటన్నారు. లగడపాటి లాంటి పెట్టుబడిదారులు, కబ్జాకోరులు కొం దరు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకుని వెంటనే పాత్రికేయులకు క్షమాపణలు చెప్పాలని లేదంటే తెలంగాణలో లగడపాటిని అడుగుపెట్ట నీయబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో తెయూ జేఏసీ నాయకులు నాగభూషణం, సంతోశ్, రమేశ్, శ్రీను, రవి, గౌతమ్, ప్రవీణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.