తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్టు ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు అధినేతను ఒప్పించలేక కులాలను రంగంలోకి తెస్తున్నారు.
- టికెట్టు కోసం మూడు ప్రధాన సామాజికవర్గాల ప్రయత్నాలు
- చంద్రబాబుకు తలబొప్పి
సాక్షి, తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్టు ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు అధినేతను ఒప్పించలేక కులాలను రంగంలోకి తెస్తున్నారు. ఆ పార్టీ కి చెందిన నాయకులు కులాల వారీగా విడిపోయి టికెట్టు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినంటూ నగరం లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలిజ సామాజికవర్గానికే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకట రమణ కూడా టీడీపీ టికెట్టు కోసం కులం కార్డుతో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నెల 8వ తేదీన మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో పాటు తిరుపతికి చెందిన ఊకా విజయకుమార్ (మాజీ పీఆర్పీ నేత) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తిరుపతి టికెట్టు బలిజలకు ఇస్తున్నందున అందరం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే చదలవాడ ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తుండగా అదే సామాజికవర్గానికి చెందిన వెంకటరమణ, ఊకా విజయకుమార్ టికెట్టు కోసం ప్రయత్నం చేస్తుండటంతో ఆ సామాజికవర్గంలో చీలిక తప్పదనే భావన వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా ప్రముఖవైద్యులు డాక్టర్ హరిప్రసాద్ కూడా కొత్తగా రంగంలోకి వచ్చారు. తిరుపతిలో తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశానని తనకే టికెట్టు ఇవ్వాలని చంద్రబాబుని కోరినట్టు తెలిసింది. కాగా చంద్రబాబు సామాజికవర్గం నాయకులు కూడా ఇప్పుడు తిరుగుబాటు బాటలో నడుస్తున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి టికెట్టు ఇచ్చిన నాయకుల గెలుపు కోసం కృషి చేస్తుంటే ఒక్కసారి కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గాలి రాజేంద్రనాయుడు, కృష్ణమూర్తినాయుడు తదితరులు సామాజికవర్గ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈసారి కమ్మ సామాజికవర్గానికే తిరుపతి టీడీపీ టికెట్టు ఇవ్వాలని తీర్మానించారు. ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు.
ఈ రెండు సామాజికవర్గాలతో పాటు టీడీపీకి పట్టు ఉన్న యాదవ సామాజికవర్గం నేతలు కూడా టికెట్టు కోసం పట్టుబడుతున్నారు. తిరుపతిలో ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతలు ఉన్నా రు. ప్రతి ఎన్నికల సమయంలోనూ వారి పేర్లు తెరపైకి రావడం ఆ తర్వాత సద్దుమణగడం జరుగుతోం ది. ఈసారి మాత్రం చంద్రబాబుపై గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నా రామచంద్రయ్య బహిరంగంగానే తమ డిమాండ్‌ను వ్యక్తం చేస్తున్నా రు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పదవుల వరకు వచ్చేసరికి పక్కనబెడుతున్నారనే ఆవేదన వారిలో ఉంది.
టికెట్టు అడిగేందుకు ఇదే అనువైన సమయమని వారు భావిస్తున్నారు. యాదవ సామాజికవర్గాన్ని విస్మరిస్తే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేయాలనే నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. దీంతో తిరుపతి టీడీపీలో సామాజికవర్గాల పోరు తుది అంకానికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అభ్యర్థి ఏ సామాజికవర్గానికి చెందిన వారైనా మిగిలిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.