దొంగతనాలు జరగకుండా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల ప్రజలకు పోలీసులు చేస్తున్న సూచన.
చోరీ ఘటనలో జుట్టుపీక్కుంటున్న నూజివీడు పోలీసులు
నూజివీడు : దొంగతనాలు జరగకుండా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల ప్రజలకు పోలీసులు చేస్తున్న సూచన. ఎందుకంటే ఇంటిగానీ, దుకాణానికిగానీ ఎవరెవరు వస్తున్నారనేది సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమవుతోంది. ఈ క్రమంలో దొంగతనాలు, ఇతర నేరాలు జరిగితే నిందితులను పట్టుకోవడం సులువుగా ఉంటుందనేది పోలీసులు ఉద్దేశం. అయితే దొంగతనానికి వచ్చి దుండుగులు దొంగతనం చేసిన తరువాత సీసీ కెమేరాలను, సీసీ కెమేరాల ఫుటేజీ నిక్షిప్తం అయ్యే హార్డ్‌డిస్క్ బాక్సును ఎత్తుకెళ్తే పరిస్థితి ఏంటి..? కచ్ఛితంగా ఇదే పరిస్థితి నూజివీడు పోలీసులకు ఎదురైంది.
మొక్కుబడిగా వేలిముద్రలు సేకరించి వాటిని విశ్లేషణ చేస్తున్నారు. పట్టణంలోని స్టార్ జనరల్ స్టోర్‌లో ఇటీవల దొంగలు పడి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లడంతోపాటు వెళుతూవెళుతూ షాపులో ఉన్న ఏడు సీసీ కెమేరాలను, వాటి ఫుటేజీ నిక్షిప్తం అయ్యే హార్డ్‌డిస్క్ బాక్స్‌ను సైతం ఎత్తికెళ్లారు. దొంగలను పట్టుకునే మీకే అన్ని తెలివితేటలు ఉంటే దొంగతనం చేసే మాకెన్ని తెలివితేటలు ఉండాలి అన్న చందంగా పోలీసులకు సవాల్ విసిరారు. ఈ చోరిని చేధించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన ఆధారం లభ్యమవ్వలేదని తెలుస్తోంది.