జిల్లాలో సమైక్య ఉద్యమం మళ్లీ ఊపందుకుంటోంది. ఎన్జీఓలు, ఉద్యోగులు రాస్తారోకోలు, మానవహారాలు చేస్తున్నారు. దీనికితోడు విద్యార్థులు చేయూతనందిస్తూనే ఉన్నారు.
	సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం మళ్లీ ఊపందుకుంటోంది. ఎన్జీఓలు, ఉద్యోగులు రాస్తారోకోలు, మానవహారాలు చేస్తున్నారు. దీనికితోడు విద్యార్థులు చేయూతనందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ దీక్షలు కొనసాగుతున్నాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని అన్ని వర్గాల ప్రజలు హెచ్చరిస్తూనే ఉన్నారు.  
	 
	 కడపలో వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ ఎస్‌ఏ షంషీర్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు.
	 
	 వీరికి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బి అంజాద్‌బాషా, అధికార ప్రతినిధి అఫ్జల్‌ఖాన్ సంఘీభావం తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
	 
	 జమ్మలమడుగులో మాదిగ దండోరా నేతలు పాపోడు, రాజా ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు ధనిరెడ్డి కొండారెడ్డి, హనుమంతరెడ్డి సంఘీభావం తెలిపారు.  
	 
	 రైల్వేకోడూరులో వైఎస్సార్‌సీపీ నేత చెవ్వు శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ నేత సాయికిశోర్‌రెడ్డి, పంజం సుకుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.
	   
	 బద్వేలులో మిద్దెల దళితవాడకు చెందిన వైఎస్సార్ సీపీ నేత యర్రబల్లె యల్లయ్య ఆధ్వర్యంలో 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి సంఘీభావం తెలిపారు.  జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.  
	 
	 ఫులివెందులలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఎర్రగుడిపల్లె, వైఎస్ జార్జిరెడ్డి ఐటీఐ సిబ్బంది, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.  
	 
	  రాయచోటిలో చిన్నమండెం, కేశాపురం, బోనాల, టి.పోలిచెరువు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
	 
	  కమలాపురం పట్టణంలో యల్లారెడ్డిపల్లె సర్పంచ్ రవిశంకర్ ఆధ్వర్యంలో పలువురు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ నేతలు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి మద్దతు తెలిపారు.  
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
