విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాలను కలుపుతూ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాజధాని ఔటర్ రింగు రోడ్డు పొడవు ఎంతుంటుందనే ఊహాగానాలకు ప్రభుత్వం తెరదించింది.
సాక్షి, హైదరాబాద్: విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాలను కలుపుతూ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాజధాని ఔటర్ రింగు రోడ్డు పొడవు ఎంతుంటుందనే ఊహాగానాలకు ప్రభుత్వం తెరదించింది. ఈ బాహ్య వలయ రహదారి మొత్తం పొడవు 183 కిలో మీటర్లు ఉంటుందని ప్రకటించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రానికి పంపింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.9,700 కోట్లు అందిస్తామంటూ కేంద్రం గతంలో చేసిన ప్రకటనను దీనిలో పొందుపరిచింది. ఈ రోడ్డు నిర్మాణానికి మొత్తం 4,117 ఎకరాల భూమి అవసరమవుతుందని నివేదికలో స్పష్టం చేసింది.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
రింగ్ రోడ్ డ్రాఫ్ట్ మ్యాప్ ప్రకారం.. ఈ బాహ్య వలయ రహదారి నిర్మాణం.. జాతీయ రహదారి(ఎన్‌హెచ్)-5 పక్కనే ఉన్న హనుమాన్‌జంక్షన్ నుంచి రామాపురం, తుమ్మలపల్లి, నందివాడ, గుడివాడ, పామర్రు, భట్లపెనమర్రు వద్ద ఉన్న కృష్ణానది మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి జంపని, చినరావూరు, వలివేరు, వేజండ్ల, పేరేచర్ల, సిరిపురం, లింగంగుంట్ల, పెదకూరపాడు, తమ్మవరం మీదుగా అమరావతి నుంచి కృష్ణానదిపైకి మళ్లించి మళ్లీ కృష్ణా జిల్లాలోని మొగుల్లూరు వద్దకు, అక్కడి నుంచి కంచికచర్ల, అల్లూరు, మైలవరం, నూజివీడు శివారు ప్రాంతాల గుండా మీర్జాపురం, హనుమాన్‌జంక్షన్ వద్ద కలుపుతారు. దీన్ని ఎన్‌హెచ్-5, ఎన్‌హెచ్-9లను కలుపుతూ నిర్మించనున్నారు.
రింగ్ రోడ్డు మొత్తం పొడవు= 183 కి.మీటర్లు
నిర్మాణానికి అవసరమైన భూమి = 4,117 ఎకరాలు
భూ సేకరణకు అయ్యే వ్యయం = సుమారు రూ.4 వేల కోట్లు
దీనికిగాను కేంద్రం చేస్తామన్న సాయం = రూ. 9,700 కోట్లు