ప్రపంచలోనే అత్యంత అరుదైన ఎర్రచందనాన్ని విస్తారంగా కలిగి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల కోసం సాయుధ బలగాలు వేట మొదలుపెట్టాయి.
రాజంపేట, న్యూస్‌లైన్: ప్రపంచలోనే అత్యంత అరుదైన ఎర్రచందనాన్ని విస్తారంగా కలిగి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల కోసం సాయుధ బలగాలు వేట మొదలుపెట్టాయి. వైఎస్‌ఆర్, చిత్తూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో ఏడు ప్లటూన్ల బలగాలు ఇప్పటికే వేటను ముమ్మరం చేశాయి. వై.కోట, కేవీబావీ, గాదెల, తుమ్మలబైలు, రోళ్లమడుగు, సానిపాయి, రాజంపేట, బాలపల్లె తదితర ప్రాంతాల్లోని డీప్ ఏరియాల్లోకి బలగాలు దూసుకెళ్తున్నాయి. కర్నూలు మూడో బెటాలియన్‌కు చెందిన బలగాలు రాజంపేట డివిజన్‌కు చేరుకున్నాయి. ఈ బలగాలు కేవలం అడవికే పరిమితం కాకుండా రహదారుల్లోనూ రాత్రిళ్లు గస్తీ, వాహనాల తనిఖీని సైతం చేపట్టాయి.
రంగంలోకి గ్రేహౌండ్స్ దళాలు?
తిరుపతి డివిజన్‌లోని తుంబరతీర్థం వద్ద డేవిడ్ కరుణాకర్, శ్రీధర్ అనే ఇద్దరు అటవీ అధికారులను స్మగ్లర్లు బరితెగించి అత్యంత దారుణంగా హతమార్చడం సంచలనం సృష్టించింది. దీన్ని అటవీ శాఖ జీర్ణించుకోలేకపోతోంది. ఇది కచ్చితం గా అటవీ దొంగ వీరప్పన్ అనచరుల పనే అయి ఉంటుందని ఆ శాఖ గట్టిగా నమ్ముతోంది.
దీంతో గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపి స్మగ్లర్లను పూర్తిగా ఏరివేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి తమిళ కూలీలు రంగంలోకి దిగి ఎర్రచందనం చెట్లను నరికి సులవుగా రోడ్డు మార్గం గూండా తరలిస్తుండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వందల సంఖ్యలో తమిళనాడుకు చెందిన ఎర్ర దొంగలు అడవుల్లోకి మూకుమ్మడిగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను కూల్చుతున్న తరుణంలో అటవీ, పోలీసు శాఖలు సంయుక్తంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.