
సాగర్ రెండు క్రస్ట్‌గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు
సాక్షి, అమరావతి/మాచర్ల/శ్రీశైలం ప్రాజెక్ట్/హోస్పేట/రాయచూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి వరద పెరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలోకి 3.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో.. ఒక గేటును ఎత్తి 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఆ తరువాత మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసే నీటిని పెంచారు. నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పశ్చిమ కనుమలతోపాటు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ అంచ నాల నేపథ్యంలో.. బుధవారం ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
పశ్చిమ కనుమల్లో ఆదివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల చేసిన వరద మంగళవారం శ్రీశైలానికి చేరింది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటంతో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని నియంత్రిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి వస్తున్న వరదను కాలువలకు విడుదల చేస్తూ మిగులు ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు.
నేడు శ్రీశైలానికి మరింత వరద
మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి నుంచి 2.50 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 2.57 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర ఉరకలెత్తుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 1.48 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. గేట్లన్నీ ఎత్తేసి 1.55 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నది ఉధృతికి కర్ణాటకలోని చారిత్రక పర్యాటక క్షేత్రం హంపీలో పలు ప్రాచీన కట్టడాలు నీట మునిగాయి. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాత్రి 11 గంటలకు 2.70 లక్షల ప్రవాహం వస్తుండగా.. 6 గేట్లను ఎత్తి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం రెండు పవర్ హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 6,458 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయాలు నిండుకుండలుగా మారిన నేపథ్యంలో ప్రజలను ముంపు బారి నుంచి తప్పించేలా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద రెండు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.