హైదరాబాద్‌ టు ఆంధ్రా | telangana people going to costa for cock fight | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు ఆంధ్రా

Jan 15 2018 1:27 AM | Updated on Jul 6 2018 3:32 PM

telangana people going to costa for cock fight - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోడి పందేలకు నగరవాసులు సైతం సై అంటున్నారు! ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే కోడి పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే సంక్రాంతికి దాదాపు 20 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లగా.. ప్రత్యేకంగా కోడి పందేల్లో పాల్గొనేందుకు మరో 10 వేల మంది వరకు వెళ్లారు. ఆదివారం అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి వీరంతా సొంత వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు పయనమయ్యారు. కోడి పందేలు, పొట్టేళ్ల పందేలతోపాటు పలుచోట్ల జరిగే గుండాటల్లో పాల్గొనేందుకు వీరు ఉత్సుకత చూపుతున్నారు. తెలంగాణవాసులను ఆహ్వానిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కటౌట్లు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. 

లష్కర్‌ టు భీమవరం 
కోడి పందేళ్లలో పాల్గొనేందుకు పలువురు లష్కర్‌వాసులు భీమవరం వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన వీరు శనివారం ఉదయం భీమవరం చేరుకున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి వెయ్యి మంది సుమారు 200 వాహనాల్లో వెళ్లారు. గత పదిహేనేళ్లుగా ఏటా భీమవరం వెళ్లడం, కోడి పందేళ్లలో పాల్గొని రావడం వీరికి మామూలే. భీమవరం ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, ప్రత్యేక భవనాలు ముందే అద్దెకు తీసుకుని, మూడ్రోజులకు సరిపడా ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసి పెట్టుకుంటారు. కొందరైతే ఇక్కడి నుంచే వంటవాళ్లను, పనివాళ్లను తీసుకువెళ్తున్నారు. భీమవరం బాట పడుతున్నవారిలో భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులు, పెద్దమొత్తంలో ఇంటి అద్దెల ఆదాయం కలిగిన వారు, పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. 

ఇక్కడ్నుంచి 90 పొట్టేళ్లు 
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లులో జరిగే పొట్టేళ్ల పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌వాసులు మక్కువ చూపుతున్నారు. ఇక్కడ్నుంచి దాదాపు 60 నుంచి 90 వరకు పొట్టేళ్లను తీసుకెళ్లారు. ‘‘ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా పొట్టేళ్ల పందెంలో పాల్గొనేందుకు వెళ్తున్నాం. మా పొట్టేళ్లు ఈసారి గతంలో కంటే మెరుగ్గా పోటీపడతాయి’’అని పాతబస్తీకి చెందిన మంజూర్‌ పేర్కొన్నారు. 

ఏపీలో కత్తులు దూసిన పందెం కోళ్లు 
ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే బరుల నిర్వాహకులు కావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. భోగి రోజే దాదాపు రూ.200 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడిపందేలు, జూదంలో రూ.150 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.30 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.20 కోట్ల మేర పందేలు సాగినట్లు అంచనా. విశాఖలో రూ.3 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.2 కోట్ల మేర పందేలు సాగినట్టు అంచనా వేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి మరీ కోడిపందేల బరులు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోడి పందేలను ప్రారంభించారు. 

పాతబస్తీలో రూ.15 కోట్ల వ్యాపారం 
ఏపీలో జరిగే కోళ్ల పందేల కోసం నగరంలో దాదాపు రూ.15 కోట్లకుపైగా కోళ్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. పాతబస్తీలోని బార్కస్, ఎర్రకుంట, షాహీన్‌ నగర్‌లో 50 మంది పందెం కోళ్ల పెంపకందారులు ఉన్నారు. ఒక్కొక్కరు కనీసం 50 నుంచి 60 కోళ్లను పెంచి, విక్రయించినట్లు తెలిసింది. ఒక్కో కోడి ధర రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా పలికినట్టు సమాచారం. వీటిని కొనుగోలు చేసేందుకు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొద్దినెలల కిందటే పందెం రాయుళ్లు వచ్చారు. వీరు దాదాపు 2 వేల నుంచి 3 వేల కోళ్ల దాకా కొనుగోలు చేసినట్టు పాతబస్తీలోని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా కొనుక్కు వెళ్లిన వాటిలో కొన్నింటిని ఇళ్లలోనే పెంచుకుంటూ వచ్చే ఏడాది పందేలకు సిద్ధం చేస్తారు. బలిష్టంగా ఉన్న కోళ్లను ఈ ఏడాదే పందెం బరిలోకి దింపుతారు. 

నగరానికి ‘పల్లె’శోభ
నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. వీధుల్లో భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగుల సయ్యాటలతో భోగిని నగరవాసులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పల్లెలకు వెళ్లలేనివారు నగరంలోనే పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. దీంతో ఆదివారం నగరంలో చాలాచోట్ల పల్లె వాతావరణం కనిపించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement