తెలంగాణది కలివిడి సంస్కృతి | telangana is being together culture | Sakshi
Sakshi News home page

తెలంగాణది కలివిడి సంస్కృతి

Oct 12 2013 12:28 AM | Updated on Sep 1 2017 11:34 PM

ఇంతకాలం తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని అవమానించిన ఆంధ్రోళ్లు ఇప్పుడు కొత్తగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి ముందుకు రావడం విడ్డూరంగా ఉందని, ఆరవై ఏళ్ల కిందట ఈ మాటను అని ఉంటే పరిస్థితి ఇంతదాక వచ్చేదికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

 గజ్వేల్, న్యూస్‌లైన్:
 ఇంతకాలం తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని అవమానించిన ఆంధ్రోళ్లు ఇప్పుడు కొత్తగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి ముందుకు రావడం విడ్డూరంగా ఉందని, ఆరవై ఏళ్ల కిందట ఈ మాటను అని ఉంటే పరిస్థితి ఇంతదాక వచ్చేదికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ‘జాగృతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బంగారు బతుకమ్మ’ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డు మైదానంలోగల సాయిబాబ మందిరం, గాడిపల్లి కల్యాణి, కల్యన్‌కర్ పద్మల ఇంట్లో మహిళలతో కలిసి బతుకమ్మలను పేర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో ఆంధ్రోళ్లు ఇలాంటి కంటితుడుపు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణది కలివిడి సంస్కృతి కాబట్టి తాము ఆంధ్రాలో బతుకమ్మ సంబరాలను స్వాగతిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి మనుషులుగా కలిసుందామని ఆమె పిలుపునిచ్చారు.  
 
 ప్రాచీన ఆలయాలను పరిరక్షించుకుందాం
 జగదేవ్‌పూర్: తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని పునరుద్ధరించడానికి కృషి చేయనున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వర్ధరాజ్‌పూర్ లో వర్ధరాజస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు, ఆచారాలను తెలియజేయడానికి బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రాంతంలోని చరిత్ర కలిగిన ఆలయాలను సందర్శించి ఆలయ స్థితి గతులను తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
 
  ఆరు వందల ఏళ్ల చరిత్ర కలిగిన వర్ధరాజస్వామి ఆలయం రెండవ కంచిగా పేరుగాంచిందన్నారు. ఇక్కడ కుడా బంగారు బల్లి, వెండి తొండలు ఉన్నాయన్నారు. అటువంటి ఆలయాన్ని పాలకులు పట్టించుకోకపోవడంతో నేడు శిథిలావస్థకు చేరుకుందన్నారు. ప్రాముఖ్యం కలిగిన వర్ధరాజస్వామి ఆలయ అభివృద్ధికి అత్యంత ప్రాచుర్యం కలిగించేలా తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కన్న కలలు నిజం అవుతాయన్నారు. ఆలయ నిర్వాహకులు కవితను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆలయంలో ఉన్న బంగారు బల్లి, వెండి తొండలను దర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ మోహన్‌రెడ్డి, జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పాల రమేష్ గౌడ్, నియోజకవర్గ కన్వినర్ సత్తిరెడ్డి, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ లక్కాకుల నరేష్, వివిధ గ్రామల సర్పంచ్‌లు దర్శనాల నర్సింలు మంగ, కరుణాకర్, బాల్‌రాజ్ బాగ్య, నాయకులు అప్పల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement