.. చర్చ మొదలైనట్లే: మనోహర్ | telangana bill discussion started in assembly : nadendla manohar | Sakshi
Sakshi News home page

.. చర్చ మొదలైనట్లే: మనోహర్

Dec 18 2013 2:29 AM | Updated on Aug 18 2018 4:13 PM

.. చర్చ మొదలైనట్లే: మనోహర్ - Sakshi

.. చర్చ మొదలైనట్లే: మనోహర్

రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో సోమవారం చర్చ ప్రారంభమైనట్లా? కాదా? అనే సందేహాలకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెరదించారు.

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో సోమవారం చర్చ ప్రారంభమైనట్లా? కాదా? అనే సందేహాలకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెరదించారు. విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లేనని, దీనిపై సాంకేతిక అంశాల జోలికి వెళ్లాల్సిన పనిలేదని వివరణ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన బీఏసీ సమావేశంలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ‘‘సోమవారం సభలో జరిగిన గందరగోళం మధ్య ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే బిల్లుపై చర్చను ప్రారంభించామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు.
 
  సీమాంధ్ర మంత్రులు మాత్రం చర్చ ప్రారంభం కాలేదని చెప్తున్నారు. పరస్పరం పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. దీనిపై మీరు వివరణ ఇవ్వండి. నిబంధనల ప్రకారం చెప్పండి’’ అని కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. ‘‘బిల్లుపై చర్చ మొదలైనట్లే. ఈ విషయంలో సాంకేతిక అంశాల జోలికి వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే చర్చ జరిపేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. నేను కూడా సాఫీగా చర్చ జరగాలని, సభ్యులందరూ తమ అభిప్రాయాలను విన్పించాలని కోరుకుంటున్నా’’అని బదులిచ్చారు. ఇదిలావుంటే.. సోమవారం శాసనసభలో విభజన బిల్లుపై చర్చ ప్రారంభిస్తున్న సందర్భంగా సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క విషయంలో జరిగిన సంఘటనలను బీఏసీ ఏకగ్రీవంగా ఖండించింది. జరిగిన ఘటన దురదృష్టకరమైనదిగా పేర్కొంటూ.. ఇలాంటి సందర్భాల్లో సభ్యులు సభ మర్యాద, గౌరవాన్ని కాపాడాల్సి ఉందని బీఏసీ భావించినట్టు శాసనసభ కార్యదర్శి ఎస్.రాజాసదారాం ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement