దసరా సెలవుల్లో ‘శిక్ష’ణ

TEachers Training in Dasara Holidays - Sakshi

మండిపడుతున్న ఉపాధ్యాయులు

ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ

జిల్లాలో 1,344 మంది ఎంపిక

ఫలితం ఇవ్వని శిక్షణ ఎందుకు : టీచర్లు

నైపుణ్యాలు పెంచుకునేందుకు దోహదం : డీఈఓ

విజయనగరంఅర్బన్‌: విద్యాశాఖ అనాలోచిత నిర్ణయం ఇటు విద్యార్థులు..అటు ఉపాధ్యాయులకు శాపంగా మారింది. బోధనా సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు ఇస్తున్న వృత్యంతర శిక్షణ తరగతుల షెడ్యూల్‌ అశాస్త్రీయంగా  ఉండడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. అనుకూలమైన రోజుల్లో శిక్షణ ఇవ్వకుండా విద్యాసంవత్సరం పూర్తవుతున్న చివరి రోజుల్లో ఇస్తే ఆ శిక్షణకు సార్థకత ఏ మేరకు ఉంటుందని ఉపాధ్యాయవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు విద్యాప్రమాణాల పెంపు పేరుతో  హక్కులను హరించే చర్యలు విద్యాశాఖ చేపడుతోందని మండిపడుతున్నాయి. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంచే వృత్యంతర శిక్షణలను వేసవి సెలవుల్లోనే ఇచ్చి విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలి. వేసవిలో శిక్షణ ఇస్తే ఉపాధ్యాయుల హక్కుల నిబంధనల మేరకు శిక్షణ తీసుకున్న రోజులకు వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో విద్యాశాఖ దసరా సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

1,344 మంది ఎంపిక
ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యాలను పెంపొందించడానికి దసరా సెలవుల్లో శిక్షణ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషన్‌ వృత్యంతర శిక్షణ తరగతుల షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఈ  నెల 9 నుంచి 13వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన 1,344 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.  తెలుగు, హిందీ, ఆంగ్లం, సోషల్‌ సబ్జెక్టులతో పాటు ప్రధానోపాధ్యాయులకు సంబంధించి ఒక్కో కేటగిరిలో 152 మంది, ఫిజికల్‌ సైన్స్, బయాలజీ సైన్స్‌ల్లో ఒక్కో సబ్జెక్ట్‌ నుంచి 117 మంది, గణిత ఉపాధ్యాయులు 344 మందిని శిక్షణకు ఎంపిక చేశారు.

శిక్షణ తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు
జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతులు బో«ధిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అన్ని రకాల యాజమాన్యాల్లో పని చేస్తున్న వారు శిక్షణకు అర్హులు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు బదిలీపై వచ్చిన వారు.. 2013 తర్వాత ఉన్నత పాఠశాలల్లో నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.

శిక్షణ ఉద్దేశం ...
ఉపాధ్యాయులు తమ వృత్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ఆధునిక సాంకేతికత, ఐసీటీ, క్యూర్‌కోడ్, దీక్షాయాప్‌ వినియోగం, డీసీఆర్, వీసీఆర్‌ల వినియోగ సామర్థ్యం పెంచడం శిక్షణ ముఖ్య ఉద్దేశం. సీసీఈ విధానంలో బోధన, ప్రశ్నపత్రాల తయారీ, తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది.

శిక్షణలెందుకు?
విద్యాహక్కు చట్టం ప్రకారం వృత్యంతర శిక్షణలు ఉపాధ్యాయులకు ఇవ్వాలి. విద్యా సంవత్సరం ప్రారంభంలో వేసవి సెలవుల్లో ఇవ్వాల్సిన శిక్షణను దసరా సెలవుల్లో ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. సిలబస్‌ మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తుకుంటున్న సమయంలో శిక్షణ ఇస్తున్నారు. ఇవి ఏ మేరకు సత్ఫతాలిస్తాయో చెప్పాలి?. ఫలితాలివ్వని శిక్షణలను నిర్వహించవద్దు.
–శ్రీపతి నాగరాజు, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్,పూసపాటిరేగ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top