మంత్రి పీఏనా..మజాకా !

teacher continues prathipati pulla rao PA

విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు మాతృసంస్థ అయిన విద్యాశాఖకు దశాబ్దాలుగా తీరని అన్యాయం చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా మినిస్టర్‌ కోటరీలో చేరి రాజ్యాంగేతరశక్తిగా కార్యకలాపాలుసాగిస్తున్నాడు. ఏ అర్హత లేకున్నా మంత్రి వ్యక్తిగత సహాయకునిగా కొనసాగుతున్నాడు. బదిలీలు, పదోన్నతుల నుంచి కాంట్రాక్టులు, కార్పొరేషన్ల లోన్ల వరకు ఏదీ కావాలన్నా ఆయన కనుసన్నల్లోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చిలకలూరిపేట టౌన్‌: నిత్యం నిబంధనల గురించి వల్లె వేసే పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓ ఉపాధ్యాయుడు పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోయినా కిమ్మనడం లేదు. విద్యాహక్కు చట్టప్రకారం ఆ శాఖలో పనిచేసేవారిని ప్రజాప్రతినిధులు పీఎలుగా నియమించుకోకూడదనే నిబంధనల్ని తుంగలో తొక్కి మరీ ఎనిమిదేళ్లుగా మంత్రి వ్యక్తిగత సహాయకునిగా కొనసాగించుకుంటున్నారు.

నిబంధనలకు నీళ్లు...
అడ్డగడ రఘునాథబాబు 1991లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా విద్యాశాఖలో నియమితుడయ్యాడు.పదేళ్ల పాటు అక్షర దీప్తిలో పనిచేశాడు. ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు డ్వాక్రా గ్రూపు నిర్వహణాధికారిగా విధులు నిర్వర్తించాడు. కానీ మాతృసంస్థలో చాక్‌పీస్‌ పట్టి బోర్డుమీద పాఠాలు చెప్పిన దాఖలాలే లేవు.1999లో ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించాడు. ఒకే సామాజిక వర్గం కావడంతో రఘు ప్రత్యేక సేవల్ని పుల్లారావు గుర్తించి 2009 నుంచి అధికారికంగా తన పీఎగా నియమించుకున్నారు. 20 ఏప్రిల్‌ 2013లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది  జీతం తీసుకుంటున్నాడు. ఈ సమయంలో పుల్లారావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో  మంత్రి అయ్యాక.. విద్యాశాఖ నిబంధనలు అడ్డుగా మారతాయన్న ముందుచూపుతో వ్యవసాయశాఖకు తన ఉద్యోగాన్ని మార్చుకున్నాడు.స్థానిక పురపాలక ఉన్నత పాఠశాలలో పనిచేయిస్తున్నట్లు తప్పుడు రికార్డులు చూపిస్తూనే మంత్రి పీఎగా కొనసాగుతున్నాడు.

అనర్హుడికి మంత్రి అందలం
అనర్హుడైన ఉపాధ్యాయుడిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందలం ఎక్కించారు.మంత్రి పీఎగా కొనసాగేవారు కనీసం గెజిటెడ్‌ అధికారి అయ్యుండాలనే నిబంధనలకు నీళ్లొదిలారు. ఆశ్రితుడైన రఘుకి చోటు కల్పించారు. దీని వల్ల మరో అధికారికి పీఎగా కొనసాగే ఛాన్స్‌ చేజారింది.మరోవైపు రఘు స్థానంలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కూడా కరువయ్యాడు. పండరీపురంలోని బీఆర్‌ఐజి పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏటా పదోతరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరుస్తున్నా..ఇంగ్లిష్‌ బోధించే ఉపాధ్యాయుడు లేక నూరు శాతం జీపీఏ సాధించడంలో వెనుకబడిపోతున్నారు. పోనీ రఘుకు ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయుణ్ణి అయినా నియమిస్తున్నారా అంటే అదీ లేదు. పోస్టు ఖాళీ చూపిస్తే మరొక ఉపాధ్యాయునికి అవకాశం లభిస్తుంది.ఇది విద్యార్థులకు మేలు చేకూ రుస్తుంది.

వివాదాలు, ఆరోపణలు
ఉపాధ్యాయుడు రఘునాథబాబు..పుల్లారావు పీఎగా నియమితులైనప్పటి నుంచి అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 2012లో మున్సిపల్‌ టీచర్ల ప్రమోషన్ల సమయంలో ఉపాధ్యాయుల నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేశారు. సీనియార్టీ లిస్ట్‌ తయారు చేయనివ్వకుండా ఉద్యోగోన్నతులు కల్పించారని అప్పట్లో ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురయ్యారు. వివిధ సామాజికవర్గ కార్పొరేషన్‌ లోన్లు మంజూరు చేయాలన్నా ఇతని పెత్తమే పెరిగిందంటూ టీడీపీలోని ఒక వర్గం బహిరంగంగా విమర్శిస్తోంది.

 తెలిసే తప్పు చేసిన మున్పిపల్‌ అధికారులు
ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్ట్‌ను ఈ నెల 8న విడుదల చేశారు.ఈ మేరకు సంబంధిత ఉత్తర్వుల నకళ్ల మీద సంతకాలు కూడా చేశారు. ప్రజాప్రతినిధుల పీఎలుగా ఉపాధ్యాయులు కొనసాగకూడదని 31 మే 2014లో విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా  సీనియార్టీ లిస్ట్‌లో మున్సిపల్‌ అధికారులు రఘు పేరు చేర్చడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చర్యలు తీసుకుంటాం
రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధుల వద్ద ఉపాధ్యాయులు పీఎలు గా పనిచేయడం లేదు. అలా ఎవరైనా పనిచేస్తున్నట్లు దృష్టికి వస్తే మాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.ప్రజాప్రతినిధుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేసే ఉపాధ్యాయులు రిలీవ్‌ కావాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. మాతృసంస్థలకు తిరిగి వెళ్లాలని మూడేళ్ల కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.  – కె.సంధ్యారాణి,కమిషనర్, పాఠశాల విద్య, ఏపీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top