ఇంత అన్యాయం చేస్తారా..! | Sakshi
Sakshi News home page

ఇంత అన్యాయం చేస్తారా..!

Published Tue, Mar 18 2014 4:18 AM

tdp women  suicide attempt

కడప అర్బన్, న్యూస్‌లైన్ :
 తమకు జరిగిన అన్యాయంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మి తీవ్ర ఆవేదనతో సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని వెంటనే నగరంలోని హిమాలయ హాస్పిటల్‌కు  తరలించారు.టీడీపీ మేయర్ అభ్యర్థి బాలకృష్ణయాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు వీఎస్ అమీర్‌బాబు వే ధింపుల కారణంగానే తాము   ఈ చర్యకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు.     

కడప నగరంలో స్థానిక సంస్థల వ్యవహారం టీడీపీ నేతల్లో సిగపట్లకు దారితీసింది. మేయర్ అభ్యర్థిగా బాలకృష్ణ యాదవ్‌ను నియమించిన సందర్భం నుంచి ప్రస్తుత సమయం వరకు తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు వాగ్వావాదాలు, గొడవ లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో తమకు అన్యాయం జరిగిందని  రెండు రోజులుగా టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మి తమ సహచరులతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. 

పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ తమకు విలువ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆవేదనకు టీడీపీ నేతలు స్పందించకపోగా  8వ డివిజన్‌లో విజయలక్ష్మి భర్త రవీంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తే అతనికి పార్టీ తరపున టికెట్ ఖరారు చేయకుండా అదే డివిజన్‌లో కాంగ్రెస్ నేత గుర్రం గంగాధర్‌కు టికెట్ ఇచ్చారు. అలాగే 26వ డివిజన్‌లో తన అత్తకు అవకాశం ఇవ్వాలని చిప్పగిరి మీనాక్షి కోరింది. అయితే  అమీర్‌బాబు అభీష్టం మేరకు పార్టీతో ఎలాంటి సంబంధం లేని యానాదమ్మ అనే మహిళకు టికెట్ ఇవ్వడంతో వారు తీవ్ర అసంతృప్తి చెందారు.
 బాలకృష్ణ యాదవ్, అమీర్‌బాబులే కారణం :
 టీడీపీ నగర మేయర్ అభ్యర్థి బాలకృష్ణ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్‌బాబులే తమ ఆత్మాయత్యాయత్నానికి  కారణమని  టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మిఆరోపించారు.  పార్టీ కోసం కష్టపడిన తమను వదిలిపెట్టి బాలకృష్ణ యాదవ్, అమీర్‌బాబులు తమకిష్టిమైన వారికి టికెట్లు అమ్ముకున్నారన్నారు.   ఈ విషయమై  జిల్లా పార్టీ కార్యాలయంలో రెండు రోజులుగా ఆందోళనలు చేశామన్నారు. కొందరు తమపై వ్యతిరేకంగా చెప్పడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తమను సస్పెండ్ చేశారన్నారు. 

పార్టీకోసం  కష్టపడితే చివరకు మమ్మల్నే పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలనుకోవడం దురదృష్టమన్నారు.  తాము బాలకృష్ణయాదవ్‌కు క్షమాపణ చెప్పాలని కోరారని  ఆ అవమానం తట్టుకోలేక  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామన్నారు. ఈ సంఘటనలకు కారణమైన అమీర్‌బాబు, బాలకృష్ణ యాదవ్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement