హైడ్రామాకు చెక్‌

TDP Muslim Leaders Protest For Resign To Chairman Mangamma - Sakshi

మున్సిపల్‌ చైర్మన్‌ కుర్చీ ఒప్పందంపై రగడ

చెర్‌పర్సన్‌ రాజీనామా చేయాలని టీడీపీలో ముస్లిం వర్గం డిమాండ్‌

తొలుత 25వ తేదీ వరకు కుదరదన్న చైర్‌పర్సన్‌

టీడీపీ నేత చెక్కు అందజేయడంతో రాజీనామా

మాచర్ల చైర్‌పర్సన్‌ మార్పు ఒప్పందంపై శుక్రవారం హైడ్రామా నడిచింది. తొలుత వైస్‌ చైర్‌పర్సన్‌ వర్గీయులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చైర్‌పర్సన్‌ మంగమ్మ రాజీనామా చేయాలని నినదించారు. సాయంత్రం వరకూ సాగిన ఈ తంతుకు రాత్రికి తెర పడింది. స్థానిక టీడీపీ నేత చైర్‌పర్సన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేసి రాజీనామా చేయించినట్లు తెలిసింది. 

గుంటూరు, మాచర్ల: పురపాలక సంఘ చైర్మన్‌ మంగమ్మ రాజీనామా చేయాలని, వైస్‌ చైర్మన్‌ షేక్‌ షాకీరూన్‌కు పదవి ఇవ్వాలని టీడీపీ ముస్లిం నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ముస్లిం నాయకులు అబ్దుల్‌ జలీల్, సుభాని, మదార్, కరిముల్లా, ముటుకూరు సుభాని ఆధ్వర్యంలో రెండు గంటలపాటు బైఠాయించారు. ‘మా తో ఆడుకుంటారా.. ముస్లింలంటే లెక్క లేదా.. మీ మీటింగ్‌లేంటి’ అంటూ కేకలు వేశారు. ఈ సమయంలో మున్సిపల్‌ చైర్మన్‌ మంగమ్మ మెప్మా ప్రాజెక్టు కార్యాలయంలోనే ఉన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి, మాజీ చైర్మన్‌ కూనిశెట్టితోపాటు పలువురు ముస్లిం నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తమకు ఒప్పందం ప్రకారం శుక్రవారం పదవి ఇస్తామన్నారని తెలిపారు.

ఈ సమయంలో అర్బన్‌ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మెప్మా గదిలో ఉన్న చైర్‌పర్సన్‌ మంగమ్మతో మంతనాలు జరిపారు. అనంతరం బయటకు వెళుతుండగా ముస్లింలు అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ముస్లింలకు, పోలీసులకు తోపులాట జరిగింది. అనంతరం ముస్లింలు బస్టాండ్‌ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేశారు. వైస్‌ చైర్మన్‌ షాకీరూన్‌ ఆధ్వర్యంలో రెండు గంటల సేపు బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో జరిగింది. పోలీసులు మంతనాలు జరపగా తిరిగి పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చైర్మన్‌ మాత్రం తాను 25వ తేదీన రాజీనామా చేస్తున్నానని చెబుతూ పురపాలక సంఘ కమిషనర్‌కు లెటర్‌ అందించింది. కమీషనర్‌ రంగారావు అనారోగ్యరీత్యా సెలవు పెట్టడంతో ఆయనపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మున్సిపల్‌ చైర్మన్‌ పదవి మార్పిడికి సంబంధించి రాత్రి 9.30 గంటలకు తెరపడింది. టీడీపీకి చెందిన కీలక నేత నుంచి రూ. 2 కోట్లకు సంబంధించి చెక్కులు తీసుకున్న తరువాత తన పదవికి రాజీనామా చేస్తూ మంగమ్మ కమిషనర్‌ రంగారావుకు లేఖ అందించారు.  శనివారం వైస్‌ చైర్మన్‌ షేక్‌ షాకిరూన్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. తొలుత జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి మందలించడంతో టీడీపీ చెందిన ఓ కీలక నేత తన బ్యాంకు అకౌంట్‌ సంబంధించిన రూ. 2 కోట్ల చెక్కును చైర్మన్‌ వర్గీయులకు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. చైర్మన్‌ తనకు సంబంధించిన బిల్లులు క్లియర్‌ చేసుకున్నాక ఈ చెక్కులు సంబంధిత నాయకుడుకు అందజేయాలి. ఈ ఒప్పందంతో చైర్మన్‌ రాజీనామా చేసినట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top