కృష్ణార్పణం

TDP Leaders Lands Kabhaju In Chittoor - Sakshi

అది మారుమూల ప్రాంతం. అక్కడ ఏం జరిగినా.. ఏం చేసినా తొంగిచూసే దిక్కులేదు..     అడ్డుకునే చేతుల్లేవు.. అదే అధికార పార్టీనేతకు కలిసొచ్చింది. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాడు. ఇదే అదునుగా ఆక్రమణకు తెగబడ్డాడు. అడ్డగోలు దందా సాగించాడు. ఎకరాల కొద్దీ చదును చేసి సాగులోకి తెచ్చుకున్నాడు. ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు ఒత్తిళ్లకు చిత్తయ్యారు. ఇష్టారాజ్యంగా పట్టాలిచ్చి చేతులు దులుపు కున్నారు. అన్నీ తెలిసినా జిల్లా ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం గమనార్హం. 

సాక్షి, చిత్తూరు: పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం బూడిదవేడు రెవెన్యూ గ్రామం పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి పెద్దఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఎకరాల వరకు స్వాహా చేశాడు. రాళ్లురప్పలను తొలగించాడు. మొక్కలు, కంప చెట్లను తీసేసి యంత్రాలతో చదును చేశాడు. ట్రాక్టర్లతో దున్నకాలు చేపట్టి దర్జాగా జామ, అల్ల నేరేడు తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఇప్పటికే పది ఎకరాల్లో దానిమ్మ నేరేడు సాగులోకి తెచ్చాడు. అనధికారికంగా బోర్లు కూడా వేసుకున్నాడు.

సాక్షి పరిశోధనతో వెలుగులోకి..
వాల్మీకిపురం మండలంలో అధికార పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి ఆగడాల గురించి గతంలో కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో పర్యటించి శోధిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బూడిదవేడు రెవెన్యూ గ్రామం  521/1, 560/2 సర్వే నంబర్లలో 16.98 ఎకరాలు, 483, 497, 521/3, 561 సర్వే నంబర్లలో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. అనుమతి లేకుండా బోర్లు వేశాడు. దర్జాగా ముళ్లపొదలతో కంచె వేసుకొని సాగు చేసుకుంటున్నాడు.

ఒకే ఇంట్లో నలుగురికి..
కృష్ణారెడ్డికి భూములు అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు నిబంధనలను గాలికొదిలేశారు. కృష్ణారెడ్డి, ఆయన భార్య, కూతురు, అమ్మకు విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. ఎలాంటి ఆసరాలేని వారికే ప్రభుత్వ భూమిని ఇవ్వాలని నిబంధన. కానీ కృష్ణారెడ్డికి భూమి ఇచ్చే విషయంలో ప్రాథమిక నిబంధనలు కూడా పాటించలేదు. 560/2 సర్వే నంబరులో కృష్ణారెడ్డి భార్య లక్ష్మీదేవికి 4.92 ఎకరాలు, 521/1 సర్వే నెంబరులో కృష్ణారెడ్డి తల్లి సరస్వతమ్మకు 4.92 ఎకరాలు, కృష్ణారెడ్డి కూతురు బిందుకు 522/4,522/2,523/4 సర్వే నంబర్లలో4.93 ఎకరాలు, సర్వే నంబరు 560/1లో 2.21 ఎకరాలు కృష్ణారెడ్డి సమీప బంధువుకు రెవెన్యూ అధికారులు అప్పనంగా రాసిచ్చేశారు.

టీడీపీ నాయకుల చేతుల్లో..
విలువైన ప్రభుత్వ భూములన్నీ టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లోకి వెళుతున్నాయి. వీరి ధాటికి కొండలు గుట్టలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిన అధికారులు ఒత్తిళ్లకు లొంగుతున్నారు. సాక్షాత్తు జిల్లా అత్యున్నతాధికారే టీడీపీ నాయకుల భూ కబ్జాలపై మౌనంగా ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొనుగోలు చేశా
పైన పేర్కొన్న భూములను వెంకటరమణ, చిన్నప్ప, నారాయణ తదితరుల నుంచి కొనుగోలు చేశా. వాటిని కూడా వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు కూడా సర్వే చేసుకుని వెళ్లారు. భూమి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తీసుకోమని చెప్పాను.  నాపై బురద చల్లడానికే కబ్జా ఆరోపణలు.    – కె.కృష్ణారెడ్డి, టీడీపీ నాయకుడు, వాల్మీకిపురం

సర్వే చేశాం.. 
రిపోర్టు సిద్ధం చేస్తున్నాం..
కృష్ణారెడ్డి ఆక్రమించారు అంటున్న భూములపై ఇప్పటికే విచారణ జరిపాం. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఇంకా నివేదిక సమర్పించలేదు. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఆలస్యమవుతోంది. రెండు మూడు రోజుల్లో నివేదికను సబ్‌ కలెక్టర్‌కు సమర్పిస్తాం.– కళావతి, తహసీల్దార్, వాల్మీకిపురం

కిశోర్‌ అండ
ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురికాకుండా రక్షణ కల్పించాల్సిన వారే భూ దోపిడీకి సహకరిస్తున్నారు. పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కిశోర్‌కుమార్‌ రెడ్డి అండతో కృష్ణారెడ్డి రెచ్చిపోతున్నారు. కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈయన భూ బాగోతంపై అప్పటి సబ్‌కలెక్టర్‌ గుణభూషణ్‌ రెడ్డి గత సంవత్సరం ఏప్రిల్‌ 19న విచారణ చేయాలని వాల్మీకిపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం సర్వేయర్‌ను కూడా పంపిన దాఖలాలు లేవు. విచారణ ఆపేయాలని తహసీల్దార్‌పై పెద్ద ఎత్తున కిశోర్‌కుమార్‌ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. రోడ్డు సర్వే, రైల్వే ట్రాక్‌ సర్వే అంటూ విచారణ వాయిదా వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top