టీడీపీ నేతల భూ మాయ..!

TDP Leaders Grabs APIIC Lands in YSR Kadapa - Sakshi

అక్రమంగా ఏపీఐఐసీ భూముల అమ్మకం

రూ.100 కోట్లకు పైగా అవినీతికి పన్నాగం

చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్‌

కడప రూరల్‌ : రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ పంచాయతీ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని ఏపీ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తమ్ముడు రాజేష్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయింరని, దీనిపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి నందా బాల సుబ్రమణ్యం, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇనమాల మహేష్‌ డిమాండ్‌ చేశారు. స్ధానిక వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1976లో  మైసూరివారిపల్లెలోని ఇండస్ట్రీయల్‌ ప్రాంతంలో ప్రభుత్వం సర్వే నంబరు 1627/4లో డిటర్జెంట్‌ ప్రైవేట్‌ ఇండియా లిమిటెడ్‌ వారికి 34 ఎకరాలు కేటాయించిందన్నారు. ఈ ఫ్యాక్టరీ దాదాపు 25 సంవత్సరాల పాటు సబ్బులను ఉత్పత్తి చేసిందన్నారు. అనంతరం కొన్ని కారణాలతో ఆ ఫ్యాక్టరీ మూతపడిందని వారు పేర్కొన్నారు. 2006 మార్చి 31న ఆ 34 ఎకరాల స్ధలాన్ని  సబ్‌ డివిజన్‌ చేయడంతో సర్వే నంబరు 2085/1లో 17.46 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్‌ సోదరుడు రాజేష్‌ తమ రిత్విక్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పేరు మీద రూ.70 లక్షలకు కొనుగోలు చేశారన్నారు.

తర్వాత గడిచిన 2019 మార్చి 18న ఆ 17.64 ఎకరాల స్థలాన్ని నాలుగు భాగాలుగా విభజించి, అందులో నాలుగు ఎకరాల ఒక భాగాన్ని  మొత్తం రూ.40 లక్షల చొప్పున స్థానిక శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ పార్టనర్స్‌ వీరంరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి, షేక్‌ జైలాబ్దిన్, బొక్కసం వెంకటా చలపతికి విక్రయించారని ఆరోపించారు. అగ్రిమెంట్‌  రాయించి ఇచ్చిన వారిలో సీఎం రాజేష్‌తో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పేరు కూడా ఉందని వారు రిజిస్ట్రేషన్‌ పత్రాలను చూపించారు. ఈ వ్యవహరమంతా పుల్లంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో జరిగిందని వివరించారు. సీఎం రాజేష్‌ నుంచి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన బాలాజీ ఇండస్ట్రీస్‌ పార్టనర్స్‌ ఒక సెంటు స్థలాన్ని రూ.6 లక్షలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు.  మిగతా స్థలాన్ని కూడా విక్రయించే దానికి పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు.

దీన్ని బట్టి మొత్తం 17.46 ఎకరాల భూమి రూ.100 కోట్లకు పైగా ఉంటుందన్నారు. కాగా బాలాజీ ఇండస్ట్రీస్‌ పార్టనర్స్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారని తెలిపారు. ఇదంతా సీఎం రమేష్‌ సోదరుడు సీఎం రాజేష్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన అనుచరులతో నడిపిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఏపీ ఐసీసీ భూములను అమ్మకూడదన్నారు. అలాంటి భూములను టీడీపీ నేతలు యథేచ్ఛగా అమ్ముకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా స్ధానికంగా నిరుద్యోగులు వేలాది మంది ఉన్నారన్నారు. ఆ భూముల్లో ప్రభుత్వం ఫ్యాక్టరీలను నిర్మించి ఉపాధి మార్గాలను చూపాలన్నారు. లేదంటే  ఆ స్థలాలను నిరుపేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top