టీడీపీలో రిటర్న్‌ గిఫ్ట్‌ గుబులు | TDP Leaders Fear on KCR Return Gift | Sakshi
Sakshi News home page

టీడీపీలో రిటర్న్‌ గిఫ్ట్‌ గుబులు

Dec 14 2018 1:16 PM | Updated on Dec 14 2018 1:16 PM

TDP Leaders Fear on KCR Return Gift - Sakshi

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు :  తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా టీడీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుంది. చంద్రబాబు అన్ని పార్టీలను ఏకం చేసి అంతా తానై ప్రచారం చేసినా తెలంగాణలో ఘోర పరాభవం చవి చూడాల్సి రావడం ఇక్కడి టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి. బాబు వైఖరితో ఉన్న పరువు కాస్తా పోయిందని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో ఓటమి ప్రభావం కచ్చితంగా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీపై ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది. పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనూ ఇటీవల కాలంలో మరింతబలం పుంజుకుంది. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో తెగతెంపులు చేసుకుని, ఎదురు దాడికి దిగడం ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టింది. పవన్‌ ఎదురుదాడితో ఇప్పటి వరకు అండగా ఉన్న కాపు సామాజిక వర్గం టీడీపీకి వ్యతిరేకంగా మారింది. జిల్లాలోని దర్శి, ఒంగోలు, పర్చూరు, గిద్దలూరు, కందుకూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో కాపు ఓటింగ్‌ కీలకంగా ఉంది. గెలుపోటములను  శాసించే స్థాయిలో వారున్నారు. రాబోయే ఎన్నికల్లో వీరి ప్రబావం మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

బీసీ ఓటు బ్యాంక్‌లో చీలిక: గతంతో పోలిస్తే బీసీ వర్గాల్లో భారీ మార్పులు సంభవించనున్నాయి. మిగిలిన సామాజిక వర్గాలతో పోలిస్తే జిల్లాలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా కనిగిరి, గిద్దలూరు, కందుకూరు, చీరాల, ఒంగోలుతో పాటు పలు నియోజకవర్గాల్లో బీసీలు కీలకంగా ఉన్నారు. వీరి ప్రభావం ఎన్నికల్లో అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు వీరంతా ఎక్కువ భాగం టీడీపీకి అండగా ఉన్నారు. ఇటీవల కాలంలో బీసీ ప్రధాన కులాల్లో మార్పు వచ్చింది. యాదవులతో పాటు పలు వర్గాలు వైఎస్సార్‌ సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. జిల్లాలో ఆ పార్టీ వీరికి  అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. తాజా పరిణామాల దృష్ట్యా వీరిలో చాలా భాగం ఆ మద్దతు పలికే అవకాశం కనిపిస్తుండడం అధికార పార్టీని బెంబేలెత్తిస్తోంది.

ప్రతిపక్ష పార్టీకి అండగా ముస్లిం ఓటర్లు..
బీజేపీని ఢీ కొడుతున్నామని ప్రచారం చేసుకోవడం ద్వారా కొంత మేర ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావచ్చని చంద్రబాబు వ్యూహం రచించారు. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ముస్లిం ఓటు బ్యాంక్‌ బలంగా ఉంది. ప్రధానంగా మార్కాపురం, ఒంగోలు, కనిగిరి, కందుకూరు, కొండపి,ç ప³ర్చూరు, గిద్దలూరు, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లో  ముస్లిం సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరిలో 95 శాతానికి పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పక్షాన ఉన్నట్లు అంచనా. నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముస్లిం సామాజిక వర్గ అభివృద్ధికి వైఎస్‌ ఎనలేని కృషి చేశారు. దీంతో ఆ సామాజిక వర్గం వైఎస్‌ జగన్‌కు అండగా నిలబడుతోంది. బాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు నెరిపినా వారు  మారే పరిస్థితి లేదన్నది టీడీపీ నేతల అంచనా. ఈ సమయంలో జగన్‌కే మద్దతు పలుకుతున్నామంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించడంతో ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక వచ్చే పరిస్థితి లేదని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

రిటర్న్‌ గిప్ట్‌ బెంగ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీలోనూ తాను అడుగు పెడతామని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటూ ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు బెంబేలెత్తి పోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉంది. దీన్ని తిరగతోడితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవన్నది టీడీపీ నేతల అభిప్రాయం. ఇక   రాష్ట్రంలో కేసీఆర్‌ సామాజిక వర్గం ఓటర్లు 3.6 శాతం ఉన్నట్లు అంచనా. ప్రధానంగా కోస్తా ప్రాంతంలో వీరి ప్రభావం కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వీరంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మద్దతు పలికే అవకాశముందని అంచనా. అదే జరిగితే చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి కష్టాలు తప్పవని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి తమకు రాష్ట్రంలో ఇబ్బందులు తెచ్చి పెడుతోందని జిల్లా టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement