నేనొస్తుంటే ఇళ్లల్లో ఉంటారా అంటూ .. | TDP Chandrababu naidu Bus Tour Flop in Prakasam | Sakshi
Sakshi News home page

చైతన్యం లేని యాత్ర

Feb 20 2020 12:15 PM | Updated on Feb 20 2020 12:16 PM

TDP Chandrababu naidu Bus Tour Flop in Prakasam - Sakshi

మేదరమెట్లలో మాట్లాడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

ఒంగోలు: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రకాశం జిల్లా జనం ఝలక్‌ ఇచ్చారు. ఆయన ఆర్భాటంగా ప్రారంభించాలనుకున్న ప్రజాచైతన్య యాత్ర జనం లేక వెలవెలబోయింది. రోడ్‌షో ఆద్యంతం కేవలం ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలకే పరిమితమైంది. కేవలం పార్టీ కార్యకర్తలు, కొద్ది సంఖ్యలో ప్రజలు మాత్రమే బయటకు రావడం, కేవలం నాయకులు సృష్టించిన హడావుడి మాత్రమే కనిపించింది. కొన్నిసార్లు చంద్రబాబు జనాన్ని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ప్రజా చైతన్యయాత్ర ప్రారంభమైంది. షెడ్యూల్‌కు 2 గంటలు ఆలస్యంగా వచ్చిన ఆయన చిలకలూరిపేట మండలం బొప్పూడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు పార్టీ శ్రేణులతో చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గాన మార్టూరు స్టేట్‌ బ్యాంకు సెంటర్‌కు చేరుకొని 1.26 గంటల నుంచి 52 నిముషాల పాటు ప్రసంగించారు.

మార్టూరు స్టేట్‌బ్యాంకు సెంటర్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు బలహీనతతో కొంచెం మద్యం తాగి రిలాక్స్‌ అవుదామనుకుంటారని సీఎం వైఎస్‌ జగన్‌ మద్యం రేట్లు భారీగా పెంచటంతో ప్రజలు వారి ఆదాయంలో అధికబాగం మద్యానికే వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఆ తర్వాత మేదరమెట్లలో మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో మీ పని చెప్తా అంటూ పోలీసులను హెచ్చరించారు. మూడు రాజధానులు వద్దని, ఆమరావతి కావాలంటూ అందరూ గట్టిగా నినదిద్దామని పిలుపునిచ్చారు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ వద్ద మాట్లాడుతూ పెన్షన్లు రద్దు చేస్తున్నారని, ఆమ్మఒడి డబ్బు అందరికీ ఇవ్వలేదని ప్రజలచే చెప్పించే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. గ్రోత్‌సెంటర్‌కు మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సిన చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు చేరుకోవడంతో కార్యకర్తలు నీరసించి పోయారు.

ప్రజలపై అసహనం..

ఒంగోలు అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో రాత్రి 8.50 గంటలకు ప్రసంగం ప్రారంభించిన చంద్రబాబు దాదాపు గంటపాటు కొనసాగించారు. తాను ప్రారంభించిన పథకాలు రద్దు చేశారంటూ మండిపడ్డారు. హోదా కోసం ప్రధాని మోదీని నిలదీయలేకపోతున్నారని మాట్లాడడమే తప్ప మోదీపై పల్లెత్తు మాట కూడా అనే ధైర్యాన్ని చేయలేదు. రోడ్డు షోలో పెద్దగా జనం లేకపోవడం చూసి రోషం లేదా.. మీకోసం నేను వస్తుంటే మీరు ఇళ్లల్లో ఉంటారా అంటూ అసహనం వ్యక్తం చేయడం చూసి విస్తుపోవడం జనం వంతయింది.   తాను అధికారంలోకి రాగానే పోలీసులను సైతం శిక్షిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ మద్యాన్ని నియంత్రించాల్సి ఎక్సయిజ్‌ పోలీసులు మద్యం షాపుల్లో మందు అమ్ముకునే స్థితికి దిగజారారని విమర్శించారు.

అన్నీ అబద్దాలే..
పోతురాజు కాలువకు తానే నిధులు ఇచ్చానంటున్న పెద్ద మనిషి ఐదేళ్ల పాలన కాలంలో ఎందుకు నిర్మించలేకపోయారో సమాధానం చెప్పకపోవడం గమనార్హం. వెలిగొండకు ప్రతి ఖరీఫ్‌కు, రబీకి నీరు విడుదల చేస్తామంటూ ప్రచారం చేసుకోవడమే సరిపోయిందంటూ జనం విమర్శలు గుప్పిస్తున్నారు స్టేజీ ఏర్పాటు చేసినప్పటికీ పలుచబడ్డ జనంతో కార్యక్రమం వెలవెలబోతుందని భావించి వాహనంపై నుంచి మాట్లాడారు. చివర్లో ప్రజాచైతన్య యాత్ర విజయవంతం అయిందని అనుకుంటున్నా...అయిందా లేదా అంటూ జనాన్ని ప్రశ్నించడం కొసమెరుపు. ఒంగోలులో గుండ్లకమ్మ నుంచి ఒంగోలుకు పైపులైను పనులు పూర్తి కాకపోయినా మేము పూర్తిచేశాం..మీకు నీరు ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దామచర్ల జనార్దన్‌ రూ.2800 కోట్లతో అభివృద్ది చేస్తే ఓట్లు మాత్రం వేయలేదన్నారు. సభ ముగిసిన అనంతరం సంతపేట సాయిబాబా ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడ కోటి రుద్రాక్షలతో ఏర్పాట్లు చేసిన పందిళ్లను సందర్శించారు. రోడ్‌షోలో చంద్రబాబు వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధనరావు, చీరాల, కొండపి, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల శాసనసభ్యులు కరణం బలరామకష్ణమూర్తి, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎంపీ శ్రీరాం మల్యాద్రి, మాజీ ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, పిడతల సాయికల్పనారెడ్డి పార్టీ నేతలు నన్నపునేని రాజకుమారి, కరణం వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement