బాబు మంత్రాంగం ఫలించేనా..?

Chandrababu Naidu Tour Fail In Prakasam  - Sakshi

ఎవరికి వారే యమునా తీరే

జిల్లా టీడీపీలో అసంతృప్తుల గోల

అభ్యర్థులను మార్చాలంటున్న మాగుంట

సిట్టింగ్‌లకు మద్దతు పలుకుతున్న కరణం, దామచర్ల

సీఎం సమీక్షలోనైనా సయోధ్య కుదిరేనా?

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార టీడీపీ నేతల మధ్య వర్గ విభేధాలు రోడ్డున పడ్డాయి. ప్రధానంగా కొండపి, సంతనూతలపాడులో సిట్టింగ్‌లను మార్చాల్సిందేనంటూ అసంతృప్తి నేతలు అధిష్టానం వద్ద పంచాయితీ పెడుతుండగా టీడీపీ జిల్లా నేతలు వర్గాలుగా విడిపోయి అసంతృప్తులకు మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇక రాజకీయంగా పట్టు సాధించేందుకు ఎమ్మెల్సీ మాగుంట కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం అభ్యర్థులను సైతం మార్చాలంటూ ముఖ్యమంత్రికి ప్రతిపాదించగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాలు ఇందుకు ససేమిరా అంటున్నాయి. ఎవరికి వారు తలొక అభ్యర్థికి మద్దతు పలుకుతూ జిల్లా టీడీపీలో వర్గ విభేదాలను పతాక స్థాయికి చేర్చారు.

సిట్టింగ్‌లను మార్చాల్సిందేనంటూ అసంతృప్తి నేతలు, వారికి మద్దతు పలుకుతున్న జిల్లా నేతలు పట్టుబడుతుండగా వారినే ఉంచాలంటూ మరి కొందరు జిల్లా నేతలు పోటీగా పావులు కదుపుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఎవరి ప్రతిపాదనకు మొగ్గుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. తమను తప్పిస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ ఇప్పటికే సిట్టింగ్‌లు తేల్చి చెబుతుండడంతో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ముఖ్యమంత్రి తల పట్టుకుంటున్నట్లు సమాచారం. అసమ్మతి సెగ అమరావతికి తాకడంతో పంచాయితీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండురోజుల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో సిటింగ్‌ వేశారు. తొలిరోజు శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత సంతనూతలపాడు, యర్రగొండపాలెం ఆయా నియోజకవర్గాల నేతలతో పంచాయితీ పెట్టారు. అంతకు ముందు పగలంతా రెండు నియోజకవర్గాల నేతలతో మంత్రులు పరిటాల సునీత,నారాయణలు సుధీర్ఘంగా చర్చించి ముఖ్యమంత్రికి నివేదిక అందచేశారు. శనివారం ఉదయం కొండపి, మార్కాపురం నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అసంతృప్తుల మధ్య సయోధ్య  కుదురుస్తారా...? లేక అభ్యర్థులను మారుస్తారా...? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

మాగుంటపై సిట్టింగ్‌ల గుర్రు..
ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య వర్గపోరు కొనసాగుతుండగా మూడో వర్గంగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెరపైకి వచ్చారు.  రాబోయే ఎన్నికల్లో తాను ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, కొండపి అభ్యర్థులను మార్చి తాను సూచించిన కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలంటూ ఆయన ప్రతిపాదన పెట్టినట్లు ఆపార్టీ వర్గాల్లోనే ప్రచారం ఉంది. దీంతో ముఖ్యమంత్రి మాగుంట ఫార్ములాకు తలూపినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాగుంట ప్రతిపాదన బయటకు పొక్కడంతో పై నియోజకవర్గాల సిట్టింగ్‌లు ఆగ్రహంతో ఊగి పోతున్నారు.

మాగుంట సంగతి ముఖ్యమంత్రి వద్ద తేలుస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలకు దిగారు. ఆది నుంచి దామచర్లకు మాగుంటతో విబేధాలు ఉన్నాయి. ఈ కారణంతో మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాంలతో మాగుంటతో సఖ్యత నెరిపారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మాగుంటకు సీఎం వద్ద ప్రాధాన్యత పెరగడంతో ఇటు కరణం బలరాం, అటు శిద్దా వర్గాలు సైతం మాగుంటపై వ్యతిరేకత పెంచుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సాహసించి మాగుంట ఫార్ములాకు ఒకే చెప్పి సిట్టింగులను మారుస్తారా...? లేక మిగిలిన నేతలకు సర్ధి చెప్పి అసమ్మతి చల్లార్చి పాత వారినే అభ్యర్థులుగా కొనసాగిస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మారకపోతే మార్చేస్తా..
జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల పనితీరు బాగా లేదని..ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎంపీపై మండిపడ్డారు. శుక్రవారం రాత్రి విష్ణుప్రియ కల్యాణమండపంలో నిర్వహించిన సమావేశంలో నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయన్నారు. చాలా మంది నేతలు ఇంటింటికీ టీడీపీ, గ్రామదర్శినితో పాటు బూత్‌లెవల్‌ సమావేశాలను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు అసలు ప్రజల్లోకే వెళ్లడం లేదన్నారు. పనితీరు బాగా లేని వారి పనితీరు మరింత దిగజారుతోందని, జిల్లాలో ఒకరిద్దరు మాత్రమే సరిగ్గా పనిచేస్తున్నారని అన్నారు. 90 రోజుల సమయం ఇస్తున్నానని..ఈలోపు మారకపోతే తానే మార్చేస్తానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలు కీలకమని, తాను రిస్క్‌ చేయదలచుకోలేదన్నారు. గెలవలేని అభ్యర్థులను నిర్మొహమాటంగా మార్చేస్తానన్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో వైఎస్సార్‌ సీపీని ఎదుర్కోవడం చాలా కష్టమని, నాయకుల పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. అభ్యర్థుల ఎంపిక తానే చూసుకుంటానని, నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ముఖ్య నేతలు వర్గవిభేదాలతో కిందిస్థాయి నేతలను మరింత గందరగోళానికి గురిచేస్తూ అసంతృప్తులను రగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యనేతలు వర్గవిభేదాలు వీడి పార్టీ కోసం పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం యర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావు, నారాయణ, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top