సర్వే పోటు 

TDP Government Fake Vote Survey Tirupati - Sakshi

ఇదివరకెన్నడూ లేనంతగా సూటు బూటు వేసుకున్న అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు చేతబట్టి పల్లెబాట పట్టారు. కొందరికి ఇష్టం లేకున్నా ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు తలొంచక తప్పడం లేదు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వారి స్పందన తెలుసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో అడుగుతారు. పల్లె జనం అమాయకంగా వారడిగిన వివరాలు తెలియజేస్తారు. ఈ సర్వేలో అసంతృప్తి వ్యక్తం చేసిన వారి వివరాలన్నీ ప్రత్యేకంగా అధికార పార్టీ కార్యాలయానికి చేరుతున్నాయని తెలిసింది.

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రొఫెసర్లు, ట్రాన్స్‌కో అధికారులు, విద్యార్థులను రంగంలోకి దింపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో కొన్ని పథకాలను సీఎం చంద్రబాబు తాత్కాలిక ఉపశమనం కోసం ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. వాటిపై జనం ఏమనుకుంటున్నారని తెలుసుకునేందుకు ప్రొఫెసర్లు, ట్రాన్స్‌కో అధికారులు, విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో 10 యూనివర్సిటీల్లో సుమారు 600 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. వారిలో 279 మందిని ఇతర జిల్లాలకు కొందరిని, మరికొందరిని ఈ  గ్రామాల్లో పర్యటించి జన స్పందనపై నివేదిక ఇవ్వమని హుకుం జారీచేశారు.

కొందరికి ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు, మూడు పథకాల అమలు తీరుపై ప్రజల స్పందన అడిగి తెలుసుకుంటున్నారు. ట్రాన్స్‌కోలో పనిచేసే ఏఈఓ, ఈఆర్‌ఓలు కొందరిని 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గురించి అభిప్రాయాలను తెలుసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఇతర జిల్లాల నుంచి యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు కొందరు చిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిసింది. వీరంతా పథకాల అమలు తీరుపై వివరాలు తెలుసుకుని నివేదికను తయారుచేసి తమ ఉన్నతాధికారుల ద్వారా హైదరాబాద్, విజయవాడలోని టీడీపీ కార్యాలయానికి చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఓట్ల తొలగింపునకు విద్యార్థులు
వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కొందరిని సర్వేల పేరుతో ట్యాబ్‌లు ఇచ్చి గ్రామాల్లోకి పంపారు. వీరికి రోజుకి రూ.200, రూ.300 చొప్పున ఇచ్చి పల్లెలో తిప్పుతున్నారు. వారు గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రతి నివాసానికి వెళ్లి కుటుంబంలోని వారి పేర్లు, వివరాలు, ప్రభుత్వ పథకాలపై స్పందన తెలుసుకుంటారు. ఆ తరువాత ఎన్నికల్లో ఎవరికి ఓటెయ్యాలని భావిస్తున్నారు? అని ప్రశ్న వేస్తారు. వారు టీడీపీకి అనుకూలంగా సమాధానం ఇవ్వని వారి వివరాలను మాత్రమే ప్రత్యేకంగా నమోదు చేసుకుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top