సర్వేలతో సరి !

TDP Government Cheating to Handloom Workers in Anantapur - Sakshi

సంక్షేమ పథకాలకు దూరంగా నేతన్నలు

గుర్తింపు కార్డులు మొదలు హెల్త్‌కార్డుల దాకా మొండి చేయి

కార్వే సర్వేతో కేంద్రం.. మరో సర్వేతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన

ఎన్నికల సంస్టే అంటున్న చేనేత సంఘాల నేతలు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ‘చేనేత రంగాన్ని ఆదుకుంటాం.. గుర్తింపు కార్డులు, ప్రత్యేక ప్యాకేజీలతో భరోసా ఇస్తాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో సర్వేలను చేశారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కూడా కార్వే సర్వే పేరుతో ఓ సర్వేను నిర్వహించింది. అయితే సర్వే అయిపోయి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఏ గుర్తింపు కార్డులు మాత్రం ఇవ్వలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం.. హౌస్‌ కం వర్క్‌షెడ్, హెల్త్‌ స్కీం కోసం సర్వేను చేపట్టినా అది ఇంకా కొనసా...గుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో సర్వేల పేరుతో వారి ఓట్లను పొందేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

లబ్ధిదారుల ఎంపికకు సర్వే
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు కార్వే సంస్థ చేత సర్వేను చేపట్టింది. వారు తమ నివేదికను ఆయా ప్రభుత్వాలకు అందించారు. కాని వాటి ద్వారా ఇప్పటి వరకు ఎవరికీ లబ్ధి చేకూరలేదు. ఇటు రాష్ట్రప్రభుత్వం వేసిన సర్వేల కోసం కొత్తగా కమిటీలనూ వేసింది. ప్రధానంగా పంచాయతీ, మండల, మునిసిపల్, జిల్లా స్థాయిలో కమిటీలను వేశారు. జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్, విద్యుత్‌ శాఖ, పీడీ డీఆర్‌డీఏ, హౌసింగ్‌ అధికారులు, చేనేత, జౌళి శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇదే తీరు మునిసిపల్, మండల, పంచాయతీ స్థాయిల్లోనూ కొనసాగుతోంది. ఆయా కమిటీలు తాము చేసే సర్వేల ఆధారంగా చేనేతలను గుర్తించడం ఒక ఎత్తు అనుకుంటే వారికి పథకాలను అమలు చేయడం మరో ఎత్తుగా ఉంటుందని చేనేత సంఘాల నాయకులు వాపోతున్నారు.  

ప్రధాన సమస్యలు ఇలా...
చేనేతలకు ప్రకటించిన రాయితీ ముడి సరుకును సకాలంలో అందించకపోవడం. పట్టు రాయితీని అనర్హులైన వారికి కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధానంగా వారు పవర్‌లూమ్స్‌ మగ్గాల ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారు. పవర్‌లూమ్స్‌ చేనేత రంగాన్ని అతలాకుతలం చేసింది. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు వాటికి వత్తాసు పలకడం. పవర్‌లూమ్స్‌ యాక్ట్‌ చట్టాలను కఠినతరంగా అమలు పరచకపోవడం వంటి సమస్యల ద్వారా చేనేత రంగం కుదేలవుతోంది. గతంలో అమలులో ఉన్న హెల్త్‌ స్కీంను ప్రభుత్వం విస్మరించడంతో చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక..  చేనేతలకు రుణమాఫీ చేసిన దాఖలాలూ లేవు. దీంతో పాటు జిల్లాలోని చేనేతలు రేషం సబ్సిడీ పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని ప్రభుత్వం అందించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందింస్తున్న ముద్రా రుణాల మంజూరులోను అలసత్వమే దర్శనమిస్తోంది.

హామీలు ఇలా...
ఈ ఏడాది ఆగస్టు 7న చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ , గుంత మగ్గాలు కలిగి వర్షాకాలంలో వానలో మునిగిన మగ్గాలకు రూ. 2 వేలు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీం, హౌస్‌ కం వర్క్‌షెడ్, కామన్‌ వర్క్‌షెడ్స్‌ వంటి హామీలను ఇచ్చారు. ఆగస్టులో ఇచ్చిన హామీకి నవంబర్‌ వరకు జీ ఓల జారీకే సరిపోయింది. నవంబర్‌లో జీఓలు జారీ అయినా  ఇప్పుడు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. వీటిని కాస్త జనవరి నుంచి మార్చి వరకు సాగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్న విమర్శలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top